లక్నో: మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అయోధ్య నుంచి పోటీ చేస్తే.. తానూ అదే నియోజక వర్గం నుంచి బరిలో ఉంటానని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం గోరఖ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. యోగి అయోధ్య నుంచి పోటీ చేయాలని అఖిలేశ్ యాదవ్ సవాల్ విసిరిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అఖిలేశ్ అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేస్తే తాను కూడా అదే నియోజకవర్గం నుంచి నామినేషన్ వేస్తానని యోగి స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య నేరుగా పోటీ జరగాలని అన్నారు.
అఖిలేశ్ యాదవ్‌కు నేరుగా పోటీ చేసే ధైర్యం లేదని యోగి విమర్శించారు. బలహీనులు ఎప్పుడూ వెనుక నుంచి దాడి చేస్తారని వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీ మాఫియా శక్తులపై ఆధారపడుతోందని, యువతకు ఉపాధి అవకాశాలను దెబ్బతీసిందని, మహిళలు, వ్యాపారుల భద్రతకు ముప్పు కలిగించిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో గతంలో సమాజ్‌వాదీ పార్టీ పాలనలో గూండాగిరి, అరాచకం, అల్లర్లు, కర్ఫ్యూలు కొనసాగాయని యోగి ఆరోపించారు. ఆ పార్టీకి ప్రతి మాఫియా ముఠా మిత్రపక్షమేనని విమర్శించారు. ప్రజలను ఆ పార్టీ ఎప్పుడూ మోసం చేస్తోందని అన్నారు.
మాఫియా కార్యకలాపాలకు పాల్పడేవారిని చట్టం ద్వారా కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికే గూండాలు, మాఫియా ముఠాల ఆగడాలను నియంత్రించిందని, మరోసారి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని చెప్పారు.
మరోవైపు, ఝంగహా ప్రాంతం నుంచి చదువుకోవడానికి వచ్చిన 12–13 ఏళ్ల బాలుడి హత్య ఘటనను కూడా యోగి ప్రస్తావించారు. ఆ బాలుడి విషయంలో ప్రతిపక్షాలు కనీసం సంతాపం కూడా తెలియజేయలేదని విమర్శించారు. బాధిత కుటుంబాన్ని తాను పరామర్శిస్తానని చెప్పారు. వీధుల్లో అశాంతికి కారణమవుతున్న వారిని గుర్తించి, బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
గోరఖ్‌పూర్‌లోని క్యాంపియర్‌గంజ్‌లో ఉత్తరప్రదేశ్ తొలి అటవీ, ఉద్యానవన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయోధ్య కేంద్రంగా యోగి, అఖిలేశ్ మధ్య రాజకీయ సవాళ్లు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సమయానికి ఈ సవాల్‌పై అఖిలేశ్ ఎలా స్పందిస్తారన్నది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


