గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌లో జరిగిన పీడీఏ రథయాత్ర సందర్భంగా బుల్డోజర్ ఢీకొని 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడిని చౌరీచౌరా పరిధిలోని రాజధాని గ్రామానికి చెందిన ఆర్యవర్ధన్ సింగ్‌గా గుర్తించారు. అతడి తండ్రి ఓంకార్ సింగ్ స్థానిక బీజేపీ నాయకుడు.
ర్యాలీ సందర్భంగా బుల్డోజర్‌తో పూలవర్షం కురిపిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బాలుడి తండ్రి ఆరోపించారు. అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్ ముందుకు వెళ్లిపోయిన తర్వాత వేగంగా వచ్చిన బుల్డోజర్ వెనుక నుంచి తన కుమారుడిని ఢీకొట్టిందని తెలిపారు. దీంతో బాలుడు రోడ్డు డివైడర్‌పై పడటంతో తల వెనుక భాగంలో తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం బాధిత కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. గోరఖ్‌పూర్ ఎమ్మెల్యే ఇంజినీర్ సర్వణ్ నిషాద్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. మంత్రి సంజయ్ నిషాద్ కూడా ఫోన్‌లో మాట్లాడి బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
మరోవైపు, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ బీజేపీ సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేసింది. ర్యాలీలో పార్టీ కార్యకర్తల నిర్లక్ష్యం, హడావుడి కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించింది. అయితే, తనకు ఈ ప్రమాదం గురించి తెలియదని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ర్యాలీకి సరైన ఏర్పాట్లు చేయడంలో పరిపాలనా యంత్రాంగం విఫలమైందని విమర్శించారు.
ప్రమాదానికి కారణమైన బుల్డోజర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని యజమాని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. బుధవారం గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుంచి ప్రారంభమైన అఖిలేశ్ ర్యాలీ చౌరీచౌరా పరిధిలోని దేవకాహి గ్రామం వరకు సాగింది. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Bihar: పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి!


