తమిళనాట పొలిటికల్‌ ట్విస్ట్‌.. స్టాలిన్‌కు కొత్త దోస్తీ! | DMK Political Shift murasoli Gives Prominence to BJP Leader Comments | Sakshi
Sakshi News home page

తమిళనాట పొలిటికల్‌ ట్విస్ట్‌.. స్టాలిన్‌కు కొత్త దోస్తీ!

Nov 19 2026 7:27 AM | Updated on Nov 19 2026 7:32 AM

DMK Political Shift murasoli Gives Prominence to BJP Leader Comments

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష డీఎంకే పార్టీ అధికారిక పత్రిక ‘మురసోలి’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలకు ప్రముఖంగా చోటు కల్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వంపై బీజేపీ నేత చేసిన విమర్శలను డీఎంకే పత్రిక పెద్ద ఎత్తున ప్రచురించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? డీఎంకే తన వైఖరిలో మార్పు చేసుకుంటోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నవంబర్ 11న ప్రచురితమైన మురసోలి సంచికలో విజయ్ ప్రభుత్వంపై నైనార్ నాగేంద్రన్ చేసిన విమర్శలకు ప్రముఖ స్థానం కల్పించారు. దీపావళి సమయంలో తమిళనాడులో చోటుచేసుకున్న హత్యల ఘటనలను ప్రస్తావిస్తూ విజయ్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. సాధారణంగా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే డీఎంకే.. అదే పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలకు తన అధికారిక పత్రికలో ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పుడు చర్చకు దారితీసింది.

విజయ్ రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని చేపట్టిన తర్వాత తమిళనాడులో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతంలో డీఎంకేతో కలిసి పనిచేసిన కాంగ్రెస్, వామపక్ష పార్టీల్లోని కొన్ని రాజకీయ శక్తులు విజయ్ వైపు మొగ్గు చూపడం డీఎంకేకు కొత్త సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ తన రాజకీయ వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు విజయ్ ప్రభుత్వాన్ని డీఎంకే, బీజేపీ రెండూ విమర్శిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య గతంలో ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనపెడితే.. ప్రస్తుతం విజయ్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. దీనిని రెండు పార్టీల మధ్య వ్యూహాత్మక సాన్నిహిత్యానికి సంకేతంగా కొందరు భావిస్తున్నారు. గతంతో పోలిస్తే బీజేపీపై డీఎంకే విమర్శల తీవ్రత తగ్గినట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, విజయ్ నేతృత్వంలోని టీవీకే బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో డీఎంకే అనుసరిస్తున్న రాజకీయ వ్యూహంలో ఇది భాగమని పలువురు చెబుతున్నారు. మొత్తానికి తమిళనాడులో విజయ్ రాజకీయ ఎదుగుదల రాజకీయ సమీకరణాలను మార్చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే, బీజేపీ మధ్య నిజంగానే కొత్త రాజకీయ అవగాహన ఏర్పడుతోందా? లేక విజయ్‌ను ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు వేర్వేరుగా వ్యూహాలు రచిస్తున్నాయా? అనే చర్చ నడుస్తోంది. 

ఇదీ చదవండి: అమెరికా గడ్డపై రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement