ధోని తమిళనాడు దత్తపుత్రుడు | MK Stalin Emotional To MS Dhoni IPL Retirement | Sakshi
Sakshi News home page

ధోని తమిళనాడు దత్తపుత్రుడు

Nov 18 2026 8:02 AM | Updated on Nov 18 2026 8:05 AM

 MK Stalin Emotional To MS Dhoni IPL Retirement

సాక్షి, చెన్నై: భారత క్రికెట్‌ దిగ్గజం, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్‌ ధోనీ ఐపీఎల్‌ క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికారు. దీంతో పలువురు ప్రముఖులు ధోని సేవలను కొనియాడారు. ఇక ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ, 2027 ఐపీఎల్‌ సీజన్‌ నుండి సీఎస్కే జట్టుకు టీమ్‌ మెంటర్‌ (సలహాదారు)గా ధోని కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.  

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమదే అన్నట్టుగా తమిళనాడులోని ప్రతి క్రికెట్‌ అభిమాని భావిస్తుంటారు. ఈ టీం సారధిగా వ్యవహరించిన ధోని తమ ఇంట్లో ఒకడిగా తమిళాభిమానాలు భావించారు. ఈ పరిస్థితులలో ఆయన ఐపీఎల్‌కు వీడ్కొలు అన్న సమాచారంతమిళనాట అభిమానుల్ని తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. 2027 ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిన రోజే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇటీవలే జహీర్‌ ఖాన్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించిన సీఎస్కే, ఇప్పుడు తల ధోనీని మెంటర్‌గా నియమిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేసింది.

క్రికెట్‌కు అతీతమైన బంధాన్ని ఇచ్చారు: ఎం.కె. స్టాలిన్‌ 
ధోనీ రిటైర్‌మెంట్‌పై డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ సామాజిక మాధ్యమం ఎ క్స్‌వేదికగా భావోద్వేగంగా స్పందించారు. తమిళనాడు దత్తపుత్రుడైన ధోనీ, చెన్నైకి కేవలం ట్రోఫీలు మాత్రమే ఇవ్వలేదన్నారు. తరతరాలను ఏకం చేసే స్ఫూర్తిని, క్రికెట్‌కు అతీతమైన ఒక గొప్ప అనుబంధాన్ని తమకు ఇచ్చారని వివరించారు. 

అన్ని మంచి విషయాలకు ఏదో ఒక రోజు ముగింపు ఉంటుందని,  తమిళనాడు దత్తపుత్రుడికి ఆయన అర్హతకు తగిన ఘనమైన వీడ్కోలు పలికేందుకు  బహుశా మరొక్క అవకాశం మిగిలి ఉందేమో అని వ్యాఖ్యలు చేశారు. లెక్కలేనన్ని సంతోష క్షణాలకు, అద్భుత విజయాలకు ధోనీకి ధన్యవాదాలు. సీఎస్కే మెంటర్‌గా తమరి  కొత్త ప్రయాణానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని స్టాలిన్‌ పేర్కొన్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement