చెన్నై కింగ్‌ ఆట ముగించాడు | Mahendra Singh Dhoni has officially retired from his IPL | Sakshi
Sakshi News home page

చెన్నై కింగ్‌ ఆట ముగించాడు

Nov 18 2026 4:59 AM | Updated on Nov 18 2026 4:59 AM

Mahendra Singh Dhoni has officially retired from his IPL

ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పిన ఎమ్మెస్‌ ధోని

కెప్టెన్‌గా ఐదు టైటిల్స్‌ అందించిన ఘనత

వచ్చే సీజన్‌లో మెంటార్‌గా బాధ్యతలు

పుట్టింది బిహార్‌లో... ప్రపంచానికి తెలిసింది జార్ఖండ్‌ బిడ్డగా... కానీ చెన్నైకి దత్తపుత్రుడిలా మారాడు... తమవాడిగా చేసుకొని చెపాక్‌ మైదానంలో ధోని నామస్మరణ చేసిన అభిమానులతో ఆటగాడిగా ఇన్నేళ్ల అతని అనుబంధం ముగిసింది. 2008లో మొదలైన ప్రస్థానానికి ఇప్పుడు తెరపడింది. బుల్లెట్‌లా దుసుకుపోయే ఫోర్లు, హోరెత్తించే సిక్సర్లు, మెరుపుకంటే వేగంగా అనిపించే స్టంపింగ్‌లు ఇకపై కనిపించవు. ఒంటిచేత్తో ఆటను మార్చిన ఆ బ్యాటింగ్, ఆశలు లేని చోట చెలరేగి గెలిపించిన 
‘ఫినిషర్‌’ షాట్లు, కెప్టెగా అనూహ్య ఫలితాలు అందించిన వ్యూహాల చాతుర్యానికి ఇక వీడ్కోలు..!  

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు (సీఎస్‌కే) పర్యాయపదంగా నిలిచిన మహేంద్ర సింగ్‌ ధోని ఆటకు వీడ్కోలు పలికాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన తర్వాత కూడా ఐపీఎల్‌లో కొనసాగిన ధోని ఇప్పుడు పూర్తిగా లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌–2027 సీజన్‌ కోసం ఆటగాళ్ల కొనసాగింపునకు సంబంధించి విధించిన గడువు మరికొద్ది గంటల్లో ముగుస్తుందనగా మంగళవారం సీఎస్‌కే యాజమాన్యం నుంచి ధోని రిటైర్మెంట్‌ ప్రకటన వచ్చింది. 

2008 నుంచి లీగ్‌ మొదలైన నాటినుంచి 2026 వరకు అతను చెన్నై జట్టుతోనే కొనసాగాడు. సీఎస్‌కేపై నిషేధం విధించిన రెండేళ్లలో (2016, 2017) రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం మినహా మిగిలిన 18 సీజన్లలో ఆ జట్టుకు అతనే కర్త, కర్మ, క్రియగా వ్యవహరించాడు. టెస్టులు, వన్డేల తరహాలో ఐపీఎల్‌లో కూడా అనూహ్యంగానే ఎలాంటి వీడ్కోలు మ్యాచ్‌లాంటిది లేకుండానే ధోని తప్పుకున్నాడు. చెపాక్‌ మైదానంలో అభిమానుల మధ్య తన చివరి మ్యాచ్‌ ఆడి ముగిస్తానని గతంలో పలు మార్లు అతను చెప్పుకున్నా... ఇప్పుడు ఆ అవకాశం లేదు.

ఆటగాడిగా తప్పుకున్నా... టీమ్‌తో ధోని బంధం ముగియలేదు. వచ్చే సీజన్‌లో తమ జట్టుకు అతను మెంటార్‌గా వ్యవహరిస్తాడని సీఎస్‌కే వెల్లడించింది. ‘ధోని లేకుండా సీఎస్‌కే లేదు. దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయాల్లో, వైఫల్యాల్లో కలిసికట్టుగా సాగుతూ మేం ముందంజ వేశాం. పరస్పర నమ్మకంతో సాగడం వల్లే ఈ బంధం ఇంత దృఢంగా నిలిచింది. 2008లో ధోని మా జట్టులో ఉండాలని నా జీవితంలోనే అత్యుత్తమ నిర్ణయం తీసుకున్నాను. సీఎస్‌కే తరఫున అతను సాధించిన ఘనతల వల్ల కాకుండా అతని గొప్ప వ్యక్తిత్వం వల్ల ఈ మాట చెబుతున్నాను. అతను ఎప్పుడైనా మా జట్టు చిరునామానే. ఇది అతని సొంతిల్లులాంటిదే’ అని సీఎస్‌కే యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌ అన్నారు. 

నువు విజిలేస్తే...
తొలి ఐపీఎల్‌ సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. తమిళంలో మాట్లాడమని ఒక అభిమాని కోరాడు. ‘దాని గురించి ఏమీ చెప్పలేను కానీ ట్రోఫీలు మాత్రం గెలిపించేందుకు ప్రయత్నిస్తా’ అని ధోని సమాధానమిచ్చాడు. అన్నట్లుగానే ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రత్యేక స్థానం కల్పించాడు. ఒకటి కాదు రెండు కాదు నాయకుడిగా ఏకంగా ఐదు టైటిల్స్‌ను అతను అందించాడు. ఐపీఎల్‌ టోర్నీ మొదలైనప్పుడు తొలి సీజన్‌ వేలానికి ముందే ‘ఐకన్‌’ ఆటగాళ్లుగా ప్రకటించిన అప్పటి భారత స్టార్ల జాబితాలో ధోని లేడు. దాంతో అతను వేలంలోకి వెళ్లాల్సి వచ్చింది. 

అందరికంటే అత్యధికంగా 1.5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 6 కోట్లు)కు సొంతం చేసుకున్న చెన్నై కొత్త చరిత్రకు పునాది వేసింది. ఆ తర్వాత లీగ్‌లో అంకెలు మాత్రమే కాదు... అతను తీసిన ప్రతీ పరుగు, కొట్టిన ప్రతీ సిక్స్, మైదానంలో వేసిన అడుగులన్నీ సీఎస్‌కే అభిమానుల దృష్టిలో భావోద్వేగ క్షణాలుగా నిలిచిపోయాయి. ధోని ఆటగాడిగా, కెప్టెగా అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు తొలి నాలుగు సీజన్లలో మూడుసార్లు ఫైనల్‌ చేరిన చెన్నై వరుసగా రెండుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. తర్వాతి నాలుగు సీజన్ల పాటు జట్టు ప్రదర్శన మెరుగ్గానే ఉన్నా... ట్రోఫీ మాత్రం దక్కలేదు.

 ఆపై స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో జట్టుపై నిషేధం పడింది. పుణేకు తొలి ఏడాది కెప్టెగా వ్యవహరించగా... తర్వాతి సీజన్‌ కోసం టీమ్‌ యాజమాన్యం అనూహ్యంగా కెపె్టన్సీ నుంచి తొలగించడంతో స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలో ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక్క మాట మాట్లాడని ధోని బహుశా ఆ కసిని తన తర్వాతి సీజన్‌లో చెన్నై తరఫున ప్రదర్శించాడు. పెద్ద వయసు ఆటగాళ్ల ఉన్న జట్టుపై ‘డాడ్స్‌ ఆర్మీ’ అని విమర్శలు వచ్చినా ... తాను మాత్రం 150కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 455 పరుగులు సాధించడంతో పాటు జట్టుకు మూడో టైటిల్‌ అందించాడు. 

2020లో జట్టు వైఫల్యం తర్వాత ‘కచ్చితంగా తప్పుకోవడం లేదు’ అని చెప్పిన ధోని తర్వాతి ఏడాదే మరో ట్రోఫీతో తన విలువను చూపించాడు. 2022లో జడేజాకు కెపె్టన్సీ ఇచ్చినా అతని వల్ల కాకపోవడంతో మధ్యలో మళ్లీ సీన్‌లోకి వచ్చిన ఎమ్మెస్‌ 2023తో ఐదో టైటిల్‌తో శిఖరాన నిలిచాడు. ఈ దశలో ధోని సగర్వంగా రిటైర్‌ అవుతాడని అంతా భావించినా అది జరగలేదు. ఫిట్‌నెస్‌ సమస్యలతో తర్వాతి రెండు సీజన్లు అతను జట్టుతో ఉండీ లేనట్లుగానే కొనసాగాడు. 2026లో ప్రతీ మ్యాచ్‌కు ప్రాక్టీస్‌ చేయడం, అభిమానులకు అభివాదం చేయడమే తప్ప ఒక్క మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదు! వచ్చే సీజన్‌లో 46 ఏళ్ల వయసులో ఇదే రొటీన్‌ను కొనసాగించే అవకాశం లేకపోవడంతో అతను తప్పుకోక తప్పలేదు.

ఆరేళ్ల తర్వాత అదే పాటతో...
2020లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినప్పుడు తన కెరీర్‌లో ముఖ్య ఘట్టాల చిత్రాలకు ‘కభీ కభీ’ హిందీ చిత్రంలోని ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌ హూ’ అనే పాటను జత చేసి ధోని వీడియోను విడుదల చేశాడు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత కూడా అదే పాట మరో వెర్షన్‌ ‘మై హర్‌ ఎక్‌ పల్‌ కా షాయర్‌ హూ’ అంటూ అదే తరహాలో వీడియో పెట్టడం విశేషం. ఐపీఎల్‌ మాత్రమే కాకుండా తన 27 ఏళ్ల కెరీర్‌లోని పలు చిరస్మరణీయ క్షణాలను, సహచరులతో దిగిన ఫోటోలను ఈ మాంటేజ్‌లో జోడించి అతను తన ఆటను ముగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement