Photo Credit: Twitter
టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆటగాడిగా తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముగించాడు. మంగళవారం ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇకపై సీఎస్‌కే జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తాడని జట్టు యాజమాన్యం స్వయంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ధోని ఆకస్మిక రిటైర్మెంట్‌తో కాస్త షాక్‌కు గురైన సీఎస్‌కే, అతడు ధరించే నెంబర్ 7 జెర్సీకి కూడా అతడి గుర్తుగా వీడ్కోలు పలకాలని సీఎస్‌కే యాజమాన్యం నిర్ణయించింది.
ఇక ఐపీఎల్‌లో తమ జట్టు కొనసాగినంత కాలం నెంబర్-7 జెర్సీని ఎవరికి ఇవ్వమని, ధోని సేవలకు గుర్తుగా ఆ ఐకానిక్ జెర్సీని షోకేస్‌లో పెట్టుకుంటామని సీఎస్‌కే తెలిపింది. ఇక ధోని ధరించే ఏడో నెంబర్ జెర్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని జూలై (7వ నెల)లో జన్మించడం వల్ల ధోని నెంబర్-7 జెర్సీని ఎంతో ఇష్టపడి ఎంచుకున్నాడు. అయితే 2020లో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ధోని సేవలకు గౌరవంగా, బీసీసీఐ డిసెంబర్ 7, 2023న ధోనికి చెందిన నెంబర్-7 జెర్సీకి రిటైర్మెంట్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

PC: Twitter
ఒక ఆటగాడిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ధోని ఇకపై మైదానంలో సీఎస్‌కే మెంటార్‌గా కనిపించనున్నాడు. అయితే 'తలా' ఫేర్‌వెల్ కోసం వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ప్రత్యేక మ్యాచ్ నిర్వహించాలని అభిమానులు కోరుతున్నారు. చివరిసారి మైదానంలో ధోని ఆడితే చూడాలని ఉందని కామెంట్లు చేస్తున్నారు.
మరి సీఎస్‌కే అవకాశమిచ్చినా ధోని ఆడుతాడా లేదా అన్నది చూడాలి. ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ, ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో అభిమానులను అలరిస్తూ వచ్చిన ధోని ఇక నుంచి మైదానంలో ఆటగాడిగా కనిపించడన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మొత్తంగా 2014లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని, ఆ తర్వాత 2020లో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. తాజాగా ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలకడంతో ఒక శకం (END OF AN ERA) ముగిసినట్లయింది.
టాప్-5 రికార్డులు ఇవే..
ఇక ఐపీఎల్‌లో 18 సీజన్ల పాటు సీఎస్‌కే జట్టుకు సేవలందించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రికార్డు స్థాయిలో 226 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి, 133 మ్యాచ్‌లను గెలిచిన ధోనీ, మిగతా కెప్టెన్లందరి కంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు. కనీసం 10 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కెప్టెన్లందరిలో, ధోనీ 58.84 విజయ శాతం ఇప్పటికీ లీగ్‌లోనే అత్యుత్తమమైనది.
2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో తన తొలి మ్యాచ్‌తో మొదలుపెట్టి, అత్యధిక టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ప్రపంచ రికార్డు కూడా ధోనీ పేరిట ఉంది.
రైనాను దాటేసి..
ధోనీ ఇటీవల సురేష్ రైనాను అధిగమించి, ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయులలో ధోనీ మూడవ స్థానంలో ఉన్నాడు. అతని మాజీ భారత సహచరులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే అతని కంటే ముందున్నారు.
వికెట్ కీపర్‌గా రికార్డు
రాంచీలో జన్మించిన ధోని వికెట్ కీపర్‌గా 190కి పైగా డిస్‌మిసల్స్ చేసి అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు.
సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో సీఎస్‌కే ఒకటిగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌ను ఐదుసార్లు గెలుచుకుంది. ఈ విజయాలన్నీ ధోనీ కెప్టెన్సీలోనే వచ్చాయి, చివరిసారిగా 2023 సీజన్‌లో గెలుపొందింది. 2022 సీజన్‌లో ధోనీ కొద్దికాలం పాటు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ, ఆ తర్వాత జట్టు ఘోరంగా విఫలమవ్వడంతో మళ్లీ పగ్గాలు చేపట్టాడు.
ఆ పరాజయాల కారణంగా సీఎస్‌కే తొలిసారిగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. 2023 తర్వాత, అతను మళ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని, ఈసారి ఆ స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. అప్పటి నుంచి సీఎస్‌కే గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది.
ఇదీ చదవండి: కివీస్‌ను మడతబెట్టిన భారత బౌలర్‌పై ఐసీసీ చర్యలు


