PC: BCCI X
ఊహాగానాలే నిజమయ్యాయి. టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఐపీఎల్‌లో తన జట్టును మార్చుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడిన ఈ బెంగాల్ పేసర్.. రాజస్తాన్ రాయల్స్‌లో చేరాడు.
సిద్ధార్థ్ కూడా..
ఇక షమీతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ మణిమరన్ సిద్ధార్థ్ కూడా రాజస్తాన్ జట్టులోకి వచ్చాడు. వీరిద్దరికి బదులుగా రాజస్తాన్.. లక్నోకు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్‌ను ట్రేడ్ చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన షమీ 2013లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో 132 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. 145 వికెట్లు కూల్చాడు. ఇక 2022- 2024 మధ్య గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీ.. 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు.
రూ. 2 కోట్లు తక్కువ జీతానికే
ఈ క్రమంలో 2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ షమీని లక్నోకు ట్రేడ్ చేసింది. అప్పుడు అతడి ధర రూ. 10 కోట్లు. అయితే, తాజాగా లక్నో నుంచి రూ. 8 కోట్లకే షమీ రాజస్తాన్‌కు ట్రేడ్ అయ్యాడు. అంటే గత జీతంతో పోలిస్తే రూ. 2 కోట్లు తక్కువకే షమీ జట్టు మారాడు. ఇదిలా ఉంటే.. షమీతో పాటు రాజస్తాన్ జట్టులో చేరిన సిద్దార్థ్ రూ. 75 లక్షల ధర యథాతథంగానే ఉంది.
మరోవైపు.. గాయం వల్ల గత సీజన్‌కు దూరమైన సామ్ కర్రాన్.. రూ. 2.4 కోట్ల జీతంతో లక్నోలో కొనసాగనున్నాడు. అంతకు ముందు రాజస్తాన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసి.. అతడికి బదులుగా.. రవీంద్ర జడేజాతో పాటు సామ్ కర్రాన్‌ను తీసుకుంది.
టీమిండియాకు దూరమైన షమీ
కాగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీకి గత కొన్నాళ్లుగా జట్టులో చోటే కరువైంది. చివరగా 2025లో టీమిండియా తరఫున వన్డే, టీ20 మ్యాచ్ ఆడిన షమీ.. 2023లో ఆఖరి టెస్టు ఆడేశాడు. సెలక్టర్లు తనను పట్టించుకోకపోవడంతో ఇటీవలే రెడ్‌బాల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన 36 ఏళ్ల షమీ.. ఐపీఎల్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఇవీ చదవండి: కెప్టెన్‌గా హెన్రిచ్ క్లాసెన్.. ప్రకటన విడుదల
గుజరాత్ టైటాన్స్‌లోకి సన్‌రైజర్స్ స్టార్ బౌలర్


