ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీసుకున్న ట్రేడ్ నిర్ణయాలపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇటీవల ఎస్‌ఆర్‌హెచ్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో భారీ ట్రేడ్ డీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎస్‌కే నుంచి ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లు సన్‌రైజర్స్‌కు వెళ్లగా.. వారి స్థానంలో లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టులోకి వచ్చారు.
అంతేకాకుండా ఎస్‌ఆర్‌హెచ్ తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మరో క్యాష్ ట్రేడ్ డీల్ చేసుకుంది. పేస్ బౌలర్ హర్షల్ పటేల్‌ను గుజరాత్ టైటాన్స్‌కు సన్‌రైజర్స్ ట్రేడ్ చేసింది. అయితే హర్షల్‌ను విడిచిపెట్టి.. వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్‌ను ఇంకా జట్టులోనే కొనసాగించడాన్ని శ్రీకాంత్ తప్పుబట్టాడు.
"సన్‌రైజర్స్ మరొక చెత్త బౌలర్ జయదేవ్ ఉనద్కట్‌ను ఇంకా వదులుకోకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అతడు తన ఫేక్ బౌలింగ్‌తో ఇన్నేళ్లు ఎలా ఆడాడో అర్థం కావడం లేదు. అసలు తుది జట్టులో అతడికి చోటు ఎలా దక్కుతుందో నాకు తెలియడం లేదు.
కానీ సీనియర్ పేసర్ అనే ఒక నెపంతో అతడిని ఇంకా జట్టులోనే ఉంచారు. గుజరాత్‌కు వెళ్లిన హర్షల్ పటేల్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కుతుందనేది అనుమానమే. ఎవరైనా గాయపడితే వాడుకోవడానికి అతడిని షెడ్‌లో ఉంచుకున్నారంతే" అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
కాగా రూ. 1 కోటితో ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకున్న ఉనద్కత్.. 2026 సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 11 ఎకానమీతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఐపీఎల్‌లో మాత్రమే ఆడతాడు
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పేసర్ టీ నటరాజన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ ట్రేడ్ చేసుకోవడంపై కూడా చిక్కా అసహనం వ్యక్తం చేశాడు. 2025 వేలంలో రూ. 10.75 కోట్లు పలికిన నటరాజన్‌ను, ఇటీవల జీషన్ అన్సారీ స్థానంలో రూ. 5 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.
"నటరాజన్, ఉనద్కట్ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. నటరాజన్ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడతాడు. మిగతా సమయంలో గాయాల పేరుతో బయటే ఉంటాడు. అయినా అతడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కేవలం ఐపీఎల్‌కు మాత్రమే ఫిట్‌గా ఉంటూ, మిగతా సమయమంతా గాయాలు అని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు" అని శ్రీకాంత్ నిప్పులు చెరిగారు.


