'అతడు అసలు టీ20 ప్లేయరే కాదు'.. సీఎస్‌కే ఆటగాడిపై సంచలన వ్యాఖ్యలు | Badrinaths massive claim on CSK batter ahead of IPL 2027 auction | Sakshi
Sakshi News home page

'అతడు అసలు టీ20 ప్లేయరే కాదు'.. సీఎస్‌కే ఆటగాడిపై సంచలన వ్యాఖ్యలు

Nov 12 2026 9:10 PM | Updated on Nov 12 2026 9:12 PM

Badrinaths massive claim on CSK batter ahead of IPL 2027 auction

ఐపీఎల్ 2027 మినీ వేలానికి సమయం దగ్గరపడుతుండటంతో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్ల ప్రక్షాళనపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్  ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ వ్యూహాలపై టీమిండియా, సీఎస్‌కే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్‌ సహా ముగ్గురు ఆటగాళ్లను సీఎస్‌కే కచ్చితంగా వదిలేయాలని అతడు సూచించాడు. కాగా ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. అంతకంటే ముందు నవంబర్ 17లోపు ఆయా ఫ్రాంచైజీలు తాము రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది.

మాథ్యూ షార్ట్‌పై ఘాటు విమర్శలు

తన యూట్యూబ్ ఛానల్ వేదికగా సీఎస్‌కే జట్టు కూర్పుపై స్పందించిన బద్రీనాథ్.. మాథ్యూ షార్ట్ ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు.

"మాథ్యూ షార్ట్‌ను సీఎస్‌కే కచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే. నా దృష్టిలో అతడు అసలు టీ20 క్రికెటర్‌లాగే కనిపించడం లేదు. స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను కూడా విడిచిపెడితే మంచిది. రూ. 5.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినప్పటికీ, గత సీజన్‌లో అతడికి సరైన అవకాశాలు ఇవ్వలేదు.

ఇక యువ ఆటగాళ్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఇద్దరిపై సీఎస్‌కే భారీగా ఒక్కొక్కరికి రూ. 14.20 కోట్ల చొప్పున మొత్తం రూ. 28 కోట్లకు పైగా ఖర్చు చేసింది. వీరిలో కార్తీక్‌ను అట్టిపెట్టుకుని, ప్రశాంత్ వీర్‌ను రిలీజ్ చేయాలని నేను భావిస్తున్నాను" అని బద్రీనాథ్ పేర్కొన్నాడు.

ట్రేడింగ్ విండోలో భాగంగా సీఎస్‌కే ఇప్పటికే ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ వంటి ఇద్దరు కీలక పేసర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇచ్చివేసింది. దీనిపై బద్రీనాథ్ స్పందిస్తూ.. "ఇప్పటికే ఇద్దరు మంచి పేసర్లను వదులుకున్నాం కాబట్టి, వేలంలో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లను కొనుగోలు చేయడానికి సీఎస్‌కే వద్ద తగినంత డబ్బు ఉండాలి. 

పైన పేర్కొన్న ముగ్గురు ఆటగాళ్లను రిలీజ్ చేస్తే దాదాపు రూ. 20 నుండి 22 కోట్ల వరకు పర్స్ విలువ మిగులుతుంది. తద్వారా వేలంలో జట్టుకు అవసరమైన కీలక ఆటగాళ్లను ఎంచుకోవచ్చు" అని విశ్లేషించాడు.

టీ20ల్లో షార్ట్ ట్రాక్ రికార్డు ఇలా
ఐపీఎల్‌లో మాథ్యూ షార్ట్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, ఓవరాల్ టీ20 క్రికెట్‌లో మాత్రం అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 175 టీ20 మ్యాచ్‌లు ఆడిన షార్ట్.. 29.58 సగటు, 145.28 స్ట్రైక్ రేట్‌తో 4,556 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement