source: IPL X
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌లో కెప్టెన్సీ మార్పుపై చర్చ మొదలైంది. ప్రస్తుత కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. గత రెండు సీజన్లలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, కెప్టెన్సీ ఒత్తిడి నేపథ్యంలో అక్షర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఓ ప్రముఖ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. అక్షర్ కెప్టెన్‌గా కొనసాగడానికి ఆసక్తిగా లేడు. ఈ విషయాన్ని ఇప్పటికే ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేశాడు. అయితే, అక్షర్‌ను కెప్టెన్‌గా కొనసాగించేందుకు ఒప్పించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ చాలా కీలకమైన ఆటగాడు. ఈ సీజన్‌లో అతడి కోసం వచ్చిన పలు భారీ ట్రేడ్ ఆఫర్లను ఆ ఫ్రాంచైజీ తిరస్కరించింది. దీని బట్టి చూస్తే ఢిల్లీ అక్షర్‌ను వదులుకోకూడదనుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న అక్షర్ పటేల్ ప్రస్తుతం రూ.16.5 కోట్ల వార్షిక పారితోషికం అందుకుంటున్నాడు. తొలుత అతడిని రూ.5 కోట్లకు జట్టు సొంతం చేసుకుంది. అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ 27 మ్యాచ్‌ల్లో కేవలం 12 విజయాలు సాధించింది.
ఒకవేళ అక్షర్ తప్పుకుంటే..?
అక్షర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. వారిద్దరు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్.
అనుభవం, సీనియారిటీ పరంగా కేఎల్ రాహుల్ ఢిల్లీకి మొదటి ఎంపిక కావచ్చు. అయితే, గతంలో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించేందుకు వచ్చిన అవకాశాలను అతడు తిరస్కరించిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
మరోవైపు పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండేళ్ల ప్రయాణం తర్వాత అతడు తిరిగి ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. గతంలో పంత్ నాయకత్వంలో ఢిల్లీ పలుమార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. 2021 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి: మరోసారి ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్


