ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు సంచలన ట్రేడ్‌ను పూర్తి చేశాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారగా.. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టులోకి చేరాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల బదిలీకి ఐపీఎల్ అధికారికంగా ఆమోదం తెలిపింది.
ఈ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా రూ.18 కోట్ల ధరకు పంజాబ్ కింగ్స్‌కు వెళ్లనున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున అతడికి రూ.16.35 కోట్ల పారితోషికం లభించేది. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ తన ప్రస్తుత పారితోషికమైన రూ.18 కోట్లకే ముంబై ఇండియన్స్‌లో చేరనున్నాడు.
ముంబైకి కొత్త కెప్టెన్ అవసరం
2024 నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా నిష్క్రమణతో ఆ జట్టుకు కొత్త నాయకుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024లో హార్దిక్ నాయకత్వంలో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే 2025లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2026లో మాత్రం తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
2024 నుంచి ముంబై కెప్టెన్‌గా 39 మ్యాచ్‌ల్లో వ్యవహరించిన హార్దిక్ 15 విజయాలు అందించగా, 24 మ్యాచ్‌ల్లో జట్టు ఓటమి పాలైంది.
హార్దిక్‌కు ఇది మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీ కానుంది. 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతడు.. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు మారాడు. ఆ జట్టుకు రెండు సీజన్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తిరిగి 2024లో ముంబై ఇండియన్స్‌కు చేరాడు. ఇప్పటివరకు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో నాలుగు టైటిళ్లు ముంబైతో, ఒకటి గుజరాత్ టైటాన్స్‌తో సాధించాడు.
బుమ్రాతో అర్ష్‌దీప్
పంజాబ్ కింగ్స్ తరఫున 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్.. ఎనిమిది సీజన్ల పాటు ఆ ఫ్రాంచైజీకే ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ కొనసాగుతున్నాడు.
ఇప్పుడు ముంబై ఇండియన్స్‌లో చేరడంతో జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసే అవకాశం అతడికి దక్కనుంది. ఈ ఇద్దరు భారత స్టార్ పేసర్లు కొత్త సీజన్‌లో ప్రత్యర్థి బ్యాటర్లకు సవాల్ విసిరే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా సంజూ శాంసన్


