PC: PV Sindhu Instagram
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇంటింటా దీపాల వెలుగు జిలుగులతో పాటు.. టపాసుల మోత కూడా మోగింది. ఇక భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు కూడా దీపావళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.
హార్దిక్ పాండ్యాతో కలిసి సంబరాలు
భర్త వెంకట దత్తసాయితో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి సంబరాలు చేసుకుంది. కాగా అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యా గత కొంతకాలంగా గాయాల వల్ల వరుస సిరీస్‌లకు దూరమవుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికీ అతడు ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముంబై నుంచి అతడు బెంగళూరుకు మకాం మార్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇక పీవీ సింధు దంపతులు కూడా బెంగళూరులోనే ఉంటున్నట్లు సమాచారం.
హార్దిక్‌తో పాటు మహీక, అగస్త్య
ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాతో కలిసి సింధు- దత్త దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ ప్రేయసి మహీక శర్మ, కుమారుడు అగస్త్య పాండ్యా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సింధు ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది.
ఈసారి HPతో సెలబ్రేషన్స్
‘‘ఈసారి దీవాళి HP(హార్దిక్ పాండ్యా), మహీక, చిన్నారి ఆగులతో కలిసి చేసుకుంటున్నాము. HPలోని మరో కోణం నన్ను నవ్వించింది. మహీక అంతరంగికంగానూ అందమైనది. ఎంతో మంచిది కూడా’’ అంటూ సింధు ఫొటోలు పంచుకుంది.

కాగా భార్య నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చిన కొన్నిరోజులకే బోల్డ్ మోడల్ మహీకతో డేటింగ్ చేస్తున్నట్లు హార్దిక్ పాండ్యా ప్రకటించాడు. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్న వీరు.. జంటగా తిరుగుతున్నారు. అప్పుడపుడు తన కుమారుడు అగస్త్యను కూడా హార్దిక్ వెంట తీసుకువెళ్తాడు. వీరంతా కలిసి చోటీ దీపావళి (నరక చతుర్ధశి) చేసుకున్నారు.
ఇవీ చదవండి: IND vs NZ: వర్షం వల్ల ఆట ‘రద్దు’.. ఊపిరి పీల్చుకున్న కివీస్!
వైభవ్ సూర్యవంశీకి కారు.. ఫొటో అదిరింది


