31లోనూ 21లా అనిపిస్తోంది
శరీర తీరును అర్ధం చేసుకోవడం ముఖ్యం
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వ్యాఖ్య
2022 తర్వాత మళ్లీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీకి అర్హత
న్యూఢిల్లీ: అత్యున్నత స్థాయిలో పోటీ పడేందుకు వయసు అడ్డంకి కానే కాదని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొంది. డిసెంబర్‌లో జరగనున్న సీజన్ ముగింపు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సింధు... 31 ఏళ్ల వయసు కొత్త 21లా అనిపిస్తోందని వెల్లడించింది. బీడబ్ల్యూఎప్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఎనిమిది మంది అత్యుత్తమ ప్లేయర్లు ఈ టోర్నీకి అర్హత సాధించారు. తాజాగా హైలో ఓపెన్ సూపర్–500 టైటిల్ గెలిచిన సింధు... గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. జూలైలో జపాన్ ఓపెన్‌లో సైతం సింధు విజేతగా నిలిచింది. ప్రధాన టోర్నీల కోసం తన సన్నద్ధత... అథ్లెట్ల మానసిక, శారీరక స్థితి... గాయాల నుంచి తిరిగి కోలుకునే తీరు... ఆటల్లో అధునాతన సాంకేతికత ప్రభావం... ఇలా పలు అంశాలపై తన మనసులో భావాలను పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
» ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–6లోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది. కోర్టులో మీ ఆట బాగుంటే అన్నీ వాటంతట అవే మీ వద్దకు వస్తాయి. విజయాలు సాధిస్తూ పోతే ర్యాంకింగ్ కూడా మెరుగవుతుంది. షట్లర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తూ టోర్నమెంట్‌లు గెలవడంపైనే దృష్టి పెడతా. ర్యాంకింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. విజయాలు వస్తున్న కొద్ది అది మెరుగవుతూ ఉంటుంది.
» బ్యాడ్మింటన్‌లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉన్నాయి. కోర్టులో ఓపిక చాలా ముఖ్యం. వచ్చే ఏడాది నుంచి 15 పాయింట్ల విధానం రాబోతుంది. కాబట్టి పరిస్థితులు మారతాయి. దానికి అనుగుణంగా మనం సిద్ధం కావాలి. గతంలోని ‘గోల్డెన్ జనరేషన్’ ప్లేయర్లతో పాటు, ప్రస్తుత తరం యువ క్రీడాకారిణులతో పోటీ పడే అవకాశం నాకు దక్కడం సంతోషం.
» వయసు ఒక అంకె మాత్రమే. మీ శరీరాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారనేది ముఖ్యం. చాలా మంది ప్లేయర్లు 30 ఏళ్లు దాటాక కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ వయసులో కూడా ఎంతో మంది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించారు. నేను ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. ఆటలో మరింత పదును పెంచే ప్రయత్నాలు నిరంతరం చేస్తున్నా.
» విశ్రాంతి లేకుండా వరుస టోర్నమెంట్‌లు ఆడుతున్నా. అందుకే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు ముందు జరగనున్న కొరియా ఓపెన్, జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌ల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే సాధన ఎంత ముఖ్యమో... తగినంత విశ్రాంతి కూడా అంతే అవసరం. ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో తాజాగా బరిలోకి దిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.
» సుదీర్ఘ కాలంగా బ్యాడ్మింటన్ ఆడుతున్నా. దీంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆటను ఆస్వాదించడం ముఖ్యం. మక్కువ ఉన్నంతవరకు అంతా సహజంగా సాగిపోతుంది. ఫిట్‌నెస్ కాపాడుకోవడం... కోర్టులో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. నేనేం 20 ఏళ్ల వయసులో లేను. కాబట్టి వరుస టోర్నమెంట్‌లు ఆడటం సాధ్యం కాదు. అయితే బరిలోకి దిగిన ఏ టోర్నమెంట్‌లో అయినా 100 శాతం కృషి చేయాలి. దానికి శారీరకంగా, మానసికంగా అత్యుత్తమ స్థితిలో ఉండాలి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని టోర్నీల ఎంపిక చేసుకుంటున్నా దీనికి నా సిబ్బంది ఎంతో సహకరిస్తున్నారు.
‘షాట్ క్లాక్’పై అసంతృప్తి
బీడబ్ల్యూఎఫ్ ప్రవేశపెట్టిన 25 సెకన్ల ‘షాట్ క్లాక్’ నిబంధనపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ నిబంధనపై క్రీడాకారుల నుంచి వస్తున్న అభ్యంతరాలను... అథ్లెట్ల కమిషన్ చైర్ పర్సన్‌గా బీడబ్ల్యూఎఫ్ దృష్టికి తీసుకెళ్లా. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి సమీక్ష జరగనుంది. ర్యాలీ ముగిసిన తర్వాత సర్వ్ చేయడానికి ఆటగాళ్లకు 25 సెకన్ల సమయం ఉంటుంది. ఆరంభంలో ఇటు ఆటగాళ్లతో పాటు అటు అంపైర్‌లు కూడా దీనివల్ల ఇబ్బంది పడ్డారు.
రిసీవర్ సిద్ధంగా ఉండి సర్వర్ లేకపోవడం... సర్వర్ సిద్ధంగా ఉండి రిసీవర్ రెడీగా లేకపోవడం ఇలా చాలా జరిగాయి. అయితే నిధానంగా అందరూ దీనికి అలవాటు పడుతున్నారు. అయితే సుదీర్ఘ ర్యాలీ ఆడిన తర్వాత ప్లేయర్లు అలసిపోతారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్లు కూడా మనుషులే కదా. అంత త్వరగా కోలుకోవడం కష్టం. అయితే నిబంధనలకు అనుగుణంగా ముందుగానే సిద్ధంగా ఉండాలని అథ్లెట్లకు కూడా తెలుసు... వారి్నంగ్‌లు వస్తాయన్న భయంతో అందరూ క్రమంగా సర్దుకుంటున్నారు.
8 సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు సింధు అర్హత సాధించడం ఇది ఎనిమిదోసారి. 2016లో సెమీఫైనల్లో ఓడిన సింధు... 2017లో రన్నరప్‌గా నిలిచింది. 2018లో టైటిల్ సాధించింది. 2019లో, 2020లో రౌండ్ రాబిన్ లీగ్ దశలో వెనుదిరిగిన సింధు 2021లో రన్నరప్‌గా నిలిచింది. 2022లో అర్హత సాధించినా గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగింది. మూడేళ్ల తర్వాత సింధు మళ్లీ ఈ ప్రతిష్టాత్మక టోర్నీ బెర్త్‌ను దక్కించుకుంది.
విరాట్ కోహ్లి సలహాలతో...
బ్యాడ్మింటన్ ప్లేయర్‌లతోనే కాకుండా ఇతర క్రీడాకారులతో తరచూ మాట్లాడుతుండటం ఎంతో స్ఫూర్తినిస్తుంది. నా కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టీమిండియా మాజీ కెపె్టన్ విరాట్ కోహ్లితో మాట్లాడాను. ఆయన అద్భుత వ్యక్తి. విరాట్ సలహాలు, ప్రోత్సాహం నాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ఒత్తిడిని పక్కనపెట్టి ఆటను ఎలా ఆస్వాదించాలో ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. అలాగే భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా నుంచి కూడా స్ఫూర్తి పొందా.

‘టెంపుల్ డివైజ్’తో ఉపయోగం...
అథ్లెట్లు గాయాల బారిన పడకుండా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ పొరపాటున గాయపడితే రికవరీనే అత్యంత ముఖ్యమైంది. విశ్రాంతి, నిద్ర, హృదయ స్పందనల రేటు, ఏకాగ్రత వంటి వివరాలను ఎప్పటికప్పుడు గమనించుకోవడం ద్వారా అథ్లెట్లు తమ శరీర తీరును బాగా అర్థం చేసుకోవచ్చు.
తాజాగా భారత వన్డే, టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వినియోగించిన ‘టెంపుల్ డివైజ్’ను గతంలో నేను కూడా వినియోగించా. దీని ద్వారా మన నిద్ర, రికవరీ ఎలా ఉంది శరీర అలసటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రతీ అథ్లెట్‌కు దీనిపై అవగాహన అవసరం. గిల్ చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. అతడికి ఇవన్నీ బాగా తెలుసు. నాకైతే ఈ పరికరం బాగా ఉపయోగపడుతోంది. అయితే అథ్లెట్లందరి శరీర తీరు ఒకలా ఉండదు. ఎవరికి వారు ప్రత్యేకం.
అనుభవం అన్నీ నేర్పుతుంది
ఫిట్‌నెస్ కాపాడుకోవడం, తదుపరి టోర్నమెంట్ కోసం సిద్ధం కావడం చాలా ముఖ్యం. నా వయసు తక్కువేం కాదు. కానీ 31 ఏళ్ల అంటే నాకు కొత్త 21లా ఉంది. ప్రస్తుతానికి నా దృష్టి అంతా వరల్డ్ టూర్ ఫైనల్స్‌పైనే ఉంది. తాజా టోర్నీల్లో విజయాలను బాగా ఆస్వాదిస్తున్నా. ఎందుకంటే గెలవడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. కోర్టులో ఎక్కడ తప్పుచేశాం... ఆ సమయంలో మన లోపల ఏం నడుస్తోంది అనే అంశాలపై ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఏర్పడింది.
21 ఏళ్ల వయసులో ఏదైనా జరిగినప్పుడు... ఎందుకలా జరుగుతుందో తెలియక విసుగు, అసహనం కలిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు. వయసుతో వచ్చిన పరిపక్వత వల్ల ఆటలో ఏం జరుగుతోందో నాకు సులువుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు గెలవడం మరింత సంతృప్తిగా అనిపిస్తోంది. అయితే టోర్నమెంట్‌లు గెలిచినప్పుడు కలిగే అనుభూతిలో మాత్రం ఎలాంటి మార్పులేదు.


