‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నీ
ఢాకా: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. అయితే ప్రధాన జట్టు న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లకు సిద్ధమవుతున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో భారత్ ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగనుంది. ‘శాఫ్’ చాంపియన్‌షిప్ కోసం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అందుబాటులో ఉన్న ప్లేయర్లతోనే జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్, మాల్దీవులుతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనున్న భారత్... ఈ నెల 11న మాల్దీవులుతో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. ఈ నెల 17న జరగనున్న ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది.
1993 నుంచి జరుగుతున్న ఈ టోర్నమెంట్‌ను ఇప్పటి వరకు 14 సార్లు నిర్వహించగా... అందులో తొమ్మిదిసార్లు టైటిల్ సాధించిన భారత్ మరో నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. పాకిస్తాన్ 1997లో అత్యుత్తమంగా మూడో స్థానం సాధించింది. పాకిస్తాన్‌తో ఆడిన గత ఏడు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచింది. చివరిసారిగా 2023లో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లో టీమిండియా 4–0తో నెగ్గింది. ఆ మ్యాచ్‌లో అప్పటి భారత కెపె్టన్ సునీల్ ఛెత్రీ ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు.


