న్యూఢిల్లీ: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించారు. సెనేట్‌లో ఐదు స్థానాలు గెలుచుకోవడంతోపాటు, ప్రతినిధుల సభలోనూ అరడజనుకు పైగా స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్‌లోని ఉభయ సభలపై ఆధిపత్యం సంపాదించారు. ఈ ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు ప్రజల నుంచి ఎదురైన వ్యతిరేకతకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర ధరలు, దిగుమతి సుంకాలు, ఇరాన్‌తో యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం రిపబ్లికన్ల ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
భారత్‌పై ఏ మేరకు ప్రభావం?
కాంగ్రెస్‌లోని రెండు సభలపై డెమోక్రాట్లకు పట్టు రావడంతో చట్టాల రూపకల్పన, ప్రభుత్వ నిధుల కేటాయింపు, అధ్యక్షుడి నిర్ణయాలపై విచారణలు, పర్యవేక్షణలో వారి పాత్ర పెరగనుంది. అయితే అమెరికా విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌కు నేరుగా పూర్తి అధికారం ఉండదు. అధ్యక్షుడిగా ట్రంప్‌కు వీటో సహా అనేక కార్యనిర్వాహక అధికారాలు కొనసాగుతాయి. అయినప్పటికీ అమెరికాతో వాణిజ్యం, అక్కడ పనిచేస్తున్న భారతీయ నిపుణులు, రక్షణ సహకారం వంటి అంశాలపై ఈ ఫలితాల ప్రభావం ఉండవచ్చు.
వాణిజ్య సుంకాలపై చర్చలు
అమెరికా.. భారత వస్తువులకు ప్రధాన మార్కెట్. దీంతో అక్కడి దిగుమతి సుంకాల్లో మార్పులు భారత ఎగుమతిదారులపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఫిబ్రవరిలో భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక రూపురేఖలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం భారత ఉత్పత్తులపై 18 శాతం పరస్పర సుంకం విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ప్రపంచ దేశాలపై అత్యవసర అధికారాలను ఉపయోగించి ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ప్రాథమిక సుంకం 10 శాతానికి తగ్గింది. భారత్-అమెరికా పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
హెచ్-1బీ వీసాదారులకు ఊరట లభిస్తుందా?
అమెరికాలో పనిచేస్తున్న భారత నిపుణులపై కూడా ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులకు సంబంధించి భవిష్యత్తులో వలస విధానాలపై కాంగ్రెస్‌లో చర్చలు, పర్యవేక్షణ పెరగవచ్చు. రిపబ్లికన్లు ప్రతిపాదించిన కొన్ని వలస విధానాలకు డెమోక్రాట్ల ఆధిపత్యం అడ్డంకిగా మారవచ్చు. అయితే దీనివల్ల తక్షణమే వీసా నిబంధనలు మారిపోతాయని చెప్పలేం. కొత్త హెచ్-1బీ దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ట్రంప్ గత సెప్టెంబర్‌లో ప్రకటించిన నిర్ణయం కూడా ఆటోమేటిక్‌గా రద్దు కాదు.
భారత్-అమెరికా సంబంధాల్లో మార్పులు?
కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల బలం పెరగడంతో భారత్‌కు సంబంధించిన అంశాలపై చర్చలు, నిర్ణయాల పరిశీలనకు మరింత ప్రాధాన్యం లభించవచ్చు. ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ సహకారం, వలస విధానాలపై చట్టసభల్లో చర్చలు పెరిగే అవకాశం ఉంది. అయితే విదేశాంగ విధానంలో ట్రంప్ అధికారాలు కొనసాగుతాయి. అధ్యక్షుడి వీటో, సెనేట్‌లో ఫిలిబస్టర్ వంటి నిబంధనలు డెమోక్రాట్ల నిర్ణయాలకు పరిమితులు విధించవచ్చు. అందువల్ల ఈ ఎన్నికలతో భారత్-అమెరికా సంబంధాల్లో తక్షణ మార్పులు వస్తాయని భావించలేం.
ఇదీ చదవండి: అమెరికా తొలి ముస్లిం సెనేటర్ సయీద్.. కర్ణాటకతో అనుబంధమిదే..


