జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ.. సినిమాను తలపించేలా ఛేజింగ్‌! | Tennessee Prison Escape Killer Captured | Sakshi
Sakshi News home page

జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ.. సినిమాను తలపించేలా ఛేజింగ్‌!

Nov 4 2026 11:58 AM | Updated on Nov 4 2026 11:58 AM

Tennessee Prison Escape Killer Captured

అమెరికాలో జైలు నుంచి తప్పించుకున్న ఓ హంతకుడి కోసం సాగిన వారం రోజుల వేటకు ఎట్టకేలకు తెరపడింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న 28 ఏళ్ల జాకబ్‌ అలెన్‌ మోర్లీని పోలీసులు తిరిగి పట్టుకున్నారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

2022లో తనతో కలిసి పనిచేసే సహోద్యోగి కోడీ బిర్చ్‌ఫీల్డ్‌ను హత్య చేసిన కేసులో మోర్లీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడిని టిప్టన్‌విల్లేలోని నార్త్‌వెస్ట్‌ కరెక్షనల్‌ కాంప్లెక్స్‌ జైలులో ఉంచారు. అయితే అక్టోబర్‌ 25న రాత్రి 11.30 గంటల సమయంలో జైలు కంచెను దాటి అతడు పరారయ్యాడు. అనంతరం సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రం నుంచి వాహనాన్ని దొంగిలించాడు.

దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు అతడి కోసం గాలింపు చేపట్టారు. టెన్నెస్సీ దర్యాప్తు సంస్థకు అందిన సమాచారంతో ఇల్లినాయిస్‌లోని ఓ ప్రాంతంలో మోర్లీ దాక్కున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఓ ట్రక్కును కూడా దొంగిలించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రీడర్‌ టెక్నాలజీ సాయంతో ఆ వాహనం కదలికలను గుర్తించారు. నిందితుడు మిస్సోరీ మీదుగా వెళ్తున్నట్లు తెలుసుకుని స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.

ఈ క్రమంలో మిస్సోరీ హైవే పోలీసులు కారోల్‌ కౌంటీలో మంగళవారం ఉదయం 11.34 గంటలకు పోలీసులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు నిందితుడు ఎదురు తిరగకుండా, తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఉండటంతో ఎలాంటి సమస్య ఎదురుపడకుండా మోర్లీని అదుపులోకి తీసుకున్నారు. అతడు ప్రయాణిస్తున్న వాహనంలో గతంలో చోరీకి గురైన మూడు తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్‌లో స్థానిక, రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు ఎఫ్‌బీఐ, యూఎస్‌ మార్షల్స్‌ సర్వీస్‌ తదితర విభాగాలు పాల్గొన్నాయి.

కాగా, మోర్లీ 2022లో తన సహోద్యోగి బిర్చ్‌ఫీల్డ్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని తన ఇంటి కింద ఓ లోహపు పెట్టెలో దాచినట్లు కోర్టు రికార్డులు తెలిపాయి. ఈ హత్య కేసులో 2025 జూన్‌లో అతడికి శిక్ష పడగా.. హత్యతో పాటు సాక్ష్యాలను తారుమారు చేయడం, ఇంట్లోకి చొరబడటం, పోలీసుల నుంచి తప్పించుకోవడం వంటి నేరాల్లోనూ అతడు దోషిగా తేలాడు. దీంతో జైలు నుంచి తప్పించుకున్న తర్వాత అతడి ఆచూకీ తెలిపిన వారికి తొలుత 2,500 డాలర్ల బహుమతి ప్రకటించగా, అనంతరం మరో 15 వేల డాలర్లు కూడా పెంచారు.

ఇదీ చదవండి: ఆయుధమా? వైన్‌ బాటిలా? అసలేం జరుగుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement