ఆయుధమా? వైన్‌ బాటిలా? అసలేం జరుగుతోంది? | China Artillery Shell Wine Bottle Claim | Sakshi
Sakshi News home page

ఆయుధమా? వైన్‌ బాటిలా? అసలేం జరుగుతోంది?

Nov 4 2026 11:14 AM | Updated on Nov 4 2026 11:23 AM

China Artillery Shell Wine Bottle Claim

పేలుడు పదార్థమా? వైన్‌ బాటిలా? 32 కిలోల బరువున్న ఓ వస్తువు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. చైనా తయారీ ఆర్టిలరీ షెల్‌ అంటూ అనుమానాలు వ్యక్తమవుతుండగా.. అది కేవలం వైన్‌ బాటిల్‌ ఆకారంలో ఉన్న వస్తువేనని చైనా అధికారులు చెబుతున్నారు. పసిఫిక్‌ దేశమైన పపువా న్యూ గినియాలో బయటపడిన ఈ వస్తువు చుట్టూ ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఆ దేశ రాజధాని పోర్ట్‌ మోర్స్బీలోని ఓ నిర్మాణ స్థలంలో గత శుక్రవారం ఈ వస్తువు కనిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నలుగురు చైనా పౌరులను అరెస్టు చేశారు. అది నిజమైన పేలుడు పరికరమా? కాదా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ వస్తువు లభించడం ఆందోళనకర పరిణామమని పోలీస్‌ కమిషనర్‌ డేవిడ్‌ మానింగ్‌ పేర్కొన్నారు.

అయితే, ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఏబీసీ) కథనం ప్రకారం.. అది చైనాకు చెందిన టైప్‌ 59 రకమైన 130 ఎంఎం ఆర్టిలరీ ప్రాజెక్టైల్‌ అయి ఉండొచ్చని గుర్తించారు. పేలని స్థితిలో ఉన్న ఈ షెల్‌లో రసాయన పేలుడు పదార్థాలు, ఫ్యూజ్‌ ఉన్నట్లు పేర్లు బయటపెట్టని వర్గాలు తెలిపాయి. అయితే, ఈ సమాచారాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

మరోవైపు, చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను కొట్టివేసింది. అది ఎలాంటి ప్రమాదం లేని వైన్‌ బాటిల్‌ ఆకారపు వస్తువని ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొంది. చైనాలో ఆయుధాల నియంత్రణకు అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నాయని, అక్కడి నుంచి సైనిక స్థాయి ఆర్టిలరీ షెల్‌ను అక్రమంగా తరలించడం దాదాపు అసాధ్యమని స్పష్టం చేసింది.

అయితే, చైనా వివరణపై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 32 కిలోల బరువున్న వైన్‌ బాటిల్‌ ఏమిటని ఒకరు ప్రశ్నించగా.. అది నిజంగా వైన్‌ బాటిల్‌ అయితే దానిపై ఎలాంటి లేబుల్‌ ఎందుకు లేదని మరొకరు నిలదీశారు. దీంతో అసలు అది ఆయుధమా? లేక వైన్‌ బాటిలా? అన్న చర్చ సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ఎన్నికల్లో భారీ ఓటమి.. ట్రంప్‌ కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement