నెతన్యాహుకు భారీ షాకిచ్చిన ట్రంప్‌ | Trump announces end to US aid to Israel after 2026 | Sakshi
Sakshi News home page

నెతన్యాహుకు భారీ షాకిచ్చిన ట్రంప్‌

Nov 4 2026 7:50 AM | Updated on Nov 4 2026 7:55 AM

Trump announces end to US aid to Israel after 2026

ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం.. మరోవైపు దేశంలో అధికారం చేజారే పరిస్థితి.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా నుంచి అందే ఆర్థిక అండకూ గండం.. ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహుకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా.. ఇకపై ఏటా అందించే దాదాపు సాయాన్ని నిలిపివేస్తామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలు కావాలంటే అమ్ముతాం కానీ.. ఉచితంగా మాత్రం డబ్బులివ్వబోమన్న సంకేతాలిచ్చారు.

అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు ఏటా సుమారు 4 బిలియన్ డాలర్ల ఆర్థిక, సైనిక సాయాన్ని ఈ ఏడాది చివరి నుంచి నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కొన్ని నెలల క్రితమే ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఆర్థికంగా బలమైన దేశమని, అమెరికా సాయం లేకుండానే తన రక్షణ అవసరాలను తీర్చుకోగలదని అభిప్రాయపడ్డారు. అయితే ఇజ్రాయెల్‌కు అవసరమైతే అండగా ఉంటామని, అమెరికా ఆయుధాలను మాత్రం కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కి చెందిన ‘ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్‌’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో నేరుగా ఆర్థిక సాయం నిలిపివేసినా.. సైనిక పరంగా ఇజ్రాయెల్‌తో సంబంధాలను కొనసాగించనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.

అయితే ఒప్పందం గడువు సంగతేంటి?
ట్రంప్ ప్రకటనపై మరో కీలక ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం (MOU) ప్రకారం.. 2019 నుంచి 2028 సెప్టెంబర్ వరకు ఏటా 3.8 బిలియన్ డాలర్ల సైనిక సాయం అందించాల్సి ఉంది. అలాంటప్పుడు ఈ ఏడాది డిసెంబర్ నాటికే ఆ సాయాన్ని ఎలా నిలిపివేస్తారనే విషయాన్ని ట్రంప్ వివరించలేదు. మరోవైపు 2027 రక్షణ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇరు దేశాల మధ్య రక్షణ సాంకేతిక సహకారాన్ని మరింత పెంచే అంశాలు కూడా ఉన్నాయి.

నెతన్యాహుపై ఇజ్రాయెల్‌లో విమర్శలు
ట్రంప్ ప్రకటన ఇజ్రాయెల్ రాజకీయాల్లోనూ కలకలం రేపింది. నెతన్యాహుకు ప్రత్యర్థిగా ఉన్న గడి ఐసెన్‌కాట్ ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల్లో ఇంతటి కీలక మార్పు చోటుచేసుకుంటుంటే.. ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థకు, ప్రజలకు మీడియా ద్వారానే విషయం తెలియడం నెతన్యాహు పాలనా తీరుకు నిదర్శనమని విమర్శించారు. ఈ పరిణామం నెతన్యాహుకు రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ.. సొంత దేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి, ప్రతిపక్షాల ఒత్తిడి ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి సమయంలో అమెరికా ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తామన్న ట్రంప్ ప్రకటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికల ఫలితాలే కారణమా?
అయితే, ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి మెజారిటీ రాకపోవడమే ట్రంప్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇక, ఎన్నికల్లో నెతన్యాహుకు ఎదురైన రాజకీయ సవాళ్లు, అమెరికాలో ఇజ్రాయెల్‌కు మద్దతుపై పెరుగుతున్న విమర్శలు.. ఈ రెండూ ఆయన పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అందుకే ట్రంప్ ప్రకటనను కేవలం ఆర్థిక నిర్ణయంగా కాకుండా అమెరికా అంతర్గత రాజకీయాలు, ఇజ్రాయెల్‌లో అధికార పోరు, మారుతున్న ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో చూడాల్సి ఉంటుంది. 

ఇదీ చదవండి: ట్రంప్‌ ఎత్తులకు కోర్టు చెక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement