కొన్ని గిన్నిస్ రికార్డులు ఊహకందని విధంగా ఉంటాయి. ఇలా కూడా రికార్డులు సృష్టించొచ్చా? అనేలా ఉంటాయి. అలాంటి విభిన్నమైన గిన్నిస్ రికార్డునే సృష్టించాడు ఈ వ్యక్తి. ఇంతకీ అతడు ఏం సాహసం చేశాడో తెలిస్తే విస్తుపోతారు.
ఆ వ్యక్తే అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన 60 ఏళ్ల రిటైర్డ్‌టాక్స్ అధికారి గ్లెన్‌వుడ్ హోస్కిన్ జూనియర్. అతడు ప్రపంచ రికార్డు సాధించడానికి మకాం మొత్తం సినిమా థియేటర్‌కి మార్చేశాడు. అక్కడే ఉంటూ ఒక్క ఏడాదిలోనే 1,207 సినిమాలు చూసి రికార్డు సృష్టించాడు. ఇంతవరకు 777 చిత్రాలతో గిన్నిస్ రికార్డుని నెలకొల్పిన వ్యక్తినే అధిగమించి వెయ్యికి పైగా సినిమాలు చూశాడు. అందుకోసం ఆయన పెన్సిల్వేనియాలోని యార్క్ హేవన్‌లో ఉన్న రీగల్ సినిమా థియేటర్‌లోనే గడపడం ప్రారంభించాడట. మార్చి 31, 2025న ఈ ఘనత సృష్టించాడట.
అన్ని సినిమాలు ఎలా చూశాడంటే..
సినిమా అభిమాని అయిన హోస్కిన్ తన చూసే మూవీల ఆధారంగా ప్లాన్ చేసుకున్నారట. తరచుగా తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు మూవీలు చూసేవాడట. ఆన్‌లైన్‌లో బ్రౌజ్ చేస్తుండగా ఈ రికార్డు గురించి తెలుసుకున్నాడట. అలాగే ఇలాంటి సవాలుని చేపట్టిన మరో సినిమా అభిమాని గురించి తెలుసుకున్నాక..తాను కూడా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడట. ఆయనకెప్పుడు ఒక సవాలు కోసం లక్ష్యం ఏర్పాటు చేసుకోవడంటే మహా సరదా అట..అందువల్ల ఇది సాధ్యంమైందని అంటున్నాడు హోస్కిన్.
ఇన్ని సినిమాలు చూసినప్పటికీ హోస్కిన్‌కి యానిమేటెడ్ సినిమాలు, కామెడీలంటేనే ఇష్టం అని చెబుతున్నాడు. అందరితో కలిసి కామెడీ మూవీలు చూస్తే ఆ ఫీల్, కిక్ వేరేలెవెల్ అని అంటున్నాడు. మరి ఇన్ని సినిమాలు చూసేందుకు హోస్కిన్ ఎంత ఖర్చు పెట్టాడంటే..ఆ థియోటర్ రీగల్ అన్‌లిమిటెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించాడట. అంటే దీని కోసం నెలకు రూ. 1250లు చొప్పున ఖర్చుపెట్టాడు.
ఈ ఫీచర్ అతనికి అనేక సినిమాలు చూసేందుకు అవకాశం కల్పించింది. అలాగే ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్‌నే తినేవాడట. అంతేకాదండోయ్ సినిమా..సినిమాకి బ్రేక్ తీసుకుంటూ..శరీరానికి వ్యాయామం ఉండేలా థియేటర్‌లోనే వాకింగ్ చేస్తుండేవాడట. పైగా ఈ రికార్డు వల్ల ఆనందకరమైన దినచర్య తోపాటు ఇతరులతో సులభంగా కలిసిపోయే అవకాశాన్ని సొంతం చేసుకున్నానని చెబుతున్నాడు హోస్కిన్.
ఇదీ చదవండి: భారత ఆటో రిక్షాపై ప్రేమతో ఆ బ్రిటన్ దంపతులు ఏం చేశారంటే..?!


