ఫొర్సిత్‌ కౌంటీలో సుచితా పటేల్‌ పోరాటం!  | Indian-American woman Shuchita Patel is fighting polls in former KKK territory | Sakshi
Sakshi News home page

ఫొర్సిత్‌ కౌంటీలో సుచితా పటేల్‌ పోరాటం! 

Nov 3 2026 6:49 AM | Updated on Nov 3 2026 6:49 AM

Indian-American woman Shuchita Patel is fighting polls in former KKK territory

జాత్యాహంకారానికి పెట్టింది పేరైన ప్రాంతం 

భారతీయ సంతతి జనాభా 16 శాతం 

16 ఏళ్లుగా ఓటమి ఎరుగని కమిషనర్‌పై పోటీ

కమ్మింగ్‌ (జార్జియా): ఒకప్పుడు ‘కు క్లక్స్‌ క్లాన్‌’(కేకేకే) పెత్తనం చెలాయించిన ప్రాంతమది. జాత్యాహంకారం నిత్యకృత్యంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవచ్చునేమో కానీ.. మంగళవారం జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో భారతీయ సంతతి మహిళ సుచితా పటేల్‌ మాత్రం కొండను ఢీకొట్టే చందంగా శక్తిమంతులను ఎదురొడ్డి నిలుస్తోంది. బెదిరింపు రాజకీయాలు చేసే ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థికి దీటైన సమాధానమిచ్చేందుకు, భవిష్యత్తు తరాలకు మెరుగైన సమాజాన్ని అందించేందుకే తాను బరిలో నిలుస్తున్నట్లు చెబుతున్నారు ఫోర్సిత్‌ కౌంటీ కమిషనర్‌ పదవికి పోటీ చేస్తున్న సుచితా పటేల్‌ చెబుతున్నారు. 

మంగళవారం నాటి ఓటింగ్‌కు డెమోక్రాట్‌ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఫోర్సిత్‌ కౌంటీకు చీకటి చరిత్ర ఎక్కువే. 1912లో ఇక్కడ నివసించిన తెల్లవాళ్లు... ఇదే రకమైన భావనతో కూడిన అరాచక కేకేకే ముఠాలు నల్లజాతి ప్రజలపై విపరీతమైన ద్వేషాన్ని చూపేది. హత్యలు, హింసాత్మక ఘటనలు కూడా బోలెడు. ఫలితంగా ఈ కౌంటీలో చాలాకాలంపాటు అసలు నల్లజాతీయులే లేకుండా పోయారు. రాష్ట్ర రాజధాని అట్లాంటా మధ్య నగరానికి కేవలం ఒక గంట దూరంలో ఉన్న ఫోర్సిత్‌ కౌంటీ మొత్తం 2.8 లక్షల జనాభాలో 61 శాతం మంది శ్వేతజాతి ప్రజలే. 

అలాంటి చోట భారత్‌ నుంచి వలసవెళ్లిన భారతీయ దంపతులకు అక్కడే జన్మించిన సుచిత పదహారేళ్లుగా పదవిలో కొనసాగుతున్న రిపబ్లికన్‌ అభ్యరి్థపై ఎన్నికల బరిలోకి దిగారు. ఫోర్సిత్‌ కౌంటీలో పరిస్థితులు మారిపోయాయి అనేందుకు కూడా శుచిత పోటీ ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మధ్యంతర ఎన్నికల్లో ఒకవక్క డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆరాధించే వారు... ఇంకోపక్క విపరీతమైన వ్యతిరేకత ఉన్న వారు ఉండటం. మంగళవారం నాటి ఎన్నికలు అమెరికా పార్లమెంటు ఉభయ సభల్లో ఎవరిది ఆధిక్యమన్న విషయాన్ని తేల్చనున్నాయి. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌లతోపాటు చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు, కౌంటీ కమిషనర్లు, స్కూల్‌ బోర్డుల అధ్యక్షుల ఎన్నికల కూడా జరుగుతుంది.   

సుచిత పటేల్‌ కూడా పెరిగిపోతున్న నిత్యావసర ధరలుపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సూటిగా చెబుతా. కిరాణా ఖర్చులు కూడా భరించలేని ప్రజలకు వలసలు, ట్రాన్స్‌జెండర్స్, అక్రమ వలసదారుల పట్టింపు అస్సలు ఉండదు’’అని తెలిపారు. దేశం మొత్తం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు దశలో ఉంది. జనాభాలో ఒక శాతం ఉన్న ఉన్నత స్థాయి వర్గం ఒకపక్కనుంటే.. ఇంకోపక్క మిగిలిన వారందరూ ఉన్నారు అని సుచిత వ్యాఖ్యానించారు. ట్రంప్‌ విధానాలపై ఇప్పటికే ప్రజల్లో ఆగ్రహం ఉందని, ఇది కాస్తా చాలా రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మారవచ్చునని అంచనా. అయితే, జార్జియా విషయంలో మాత్రం ఇప్పటికీ మినహాయింపు కొనసాగుతోంది. ఇక్కడి అంచనా ప్రకారం రిపబ్లికన్‌ పార్టీ రంగు ‘రూబీ రెడ్‌’కొనసాగుతోంది. 

ఫోర్సిత్‌ కౌంటీలో 2000లో భారతీయ సంతతి వారు కేవలం 200 మంది మాత్రమే ఉండగా ఇప్పుడు దాదాపు 48 వేల మంది ఉన్నారు. ఈ లెక్కన చూస్తే సుచితా పటేల్‌ విజయావకాశాలు అంతంతమాత్రమే అయినప్పటికీ తన గెలుపుపై ఆమె దీమాగానే ఉన్నారు. ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా కమిషనర్‌గా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉండాలని అన్నారు. బెదిరింపులు, భయపెట్టి ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పిస్తూండటం వల్లనే ప్రస్తుత కమిషనర్‌ టాడ్‌ లావెంట్‌ 16 ఏళ్లపాటు అధికారంలో కొనసాగ గలుగుతున్నారని ఆమె ఆరోపించారు. తనకు రాజకీయ అనుభవం లేదని.. కాకపోతే తాను చేయలేని పనంటూ ఏదీ లేదని గట్టిగా నమ్ముతానని నలభై ఏళ్ల సుచిత తెలిపారు. 

కమిషనర్‌ పదవికి పోటీ చేయమని కొందరు వచ్చి అడిగేంతవరకూ తనకు ఆ ఆలోచన లేదని, ఆ తరువాత మాత్రం ఇది సాధ్యమేనన్న విశ్వాసం బలపడిందన్నారు. బెదిరింపులకు లొంగని గట్టి మనిషి కావాలంటే.. ‘‘మీరు సరైన వాళ్లనే ఎంచుకున్నారు’’అని మద్దతుదారులకు చెప్పానని నవ్వుతూ తెలిపారు. ఏడేళ్ల తన కూతురు ఎన్నికల పోటీ గురించి అడిగితే.. ‘‘ఈ సమాజం మీ కోసం మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అందమైన సమాజంలో పెరగాలని కోరుకుంటున్నాను. భవిష్యత్‌ తరాలు.. అంటే మీరు, మీ స్నేహితులు...అందమైన ప్రపంచంలో పెరగాలని నా కోరిక,’’అని చెప్పినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement