వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలై, కాంగ్రెస్‌పై డెమోక్రాట్లు ఆధిపత్యం సాధిస్తే తన వ్యూహం ఎలా ఉంటుందో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అప్పుడు తాను ‘మిస్టర్ వీటో’గా మారతానని వ్యాఖ్యానించారు. డెమోక్రాట్లు ఆమోదించే బిల్లులను వీటో అధికారంతో అడ్డుకుంటానని చెప్పారు.
న్యూయార్క్ పోస్ట్‌కు చెందిన ‘పాడ్ ఫోర్స్ వన్’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే నెల లేదా రెండు నెలల పాటు వీటో అధికారాన్ని ఉపయోగిస్తానని, ఆ తర్వాత డెమోక్రాట్లతో ఒప్పందాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు మెజారిటీ సాధించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వైట్‌హౌస్ ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు ఇద్దరు అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడికి స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది? అధికార పరిధిని ఎంతవరకు వినియోగించుకోవచ్చు? న్యాయస్థానాల్లో వాటిని ఎలా సమర్థించుకోవాలి? అనే అంశాలపై వైట్‌హౌస్ న్యాయ సలహాదారు విల్ షార్ఫ్ బృందం పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు.
అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లకు 218-214 మెజారిటీ ఉండగా, సెనేట్‌లో 53-47 ఆధిక్యం ఉంది. ఈ ఆధిక్యాన్ని అధిగమించాలంటే డెమోక్రాట్లు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ కనీసం నాలుగు స్థానాలను అదనంగా గెలుచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ముందస్తు సర్వేల్లో ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ, సెనేట్ పోరు మాత్రం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే దిగుమతులపై భారీ సుంకాలు విధించడం, వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వంటి నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నారు. ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించిన విదేశాంగ విధాన నిర్ణయాల్లోనూ కాంగ్రెస్ ఆమోదం లేదా కొత్త చట్టాలు లేకుండానే కార్యనిర్వాహక అధికారాలను వినియోగించారు.
అయితే, కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే ట్రంప్ పాలనపై విచారణలు ఎదురయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష అధికారాలను తనకు, తన మిత్రులకు లేదా విరాళాలు ఇచ్చిన వారికి ప్రయోజనం చేకూర్చేలా ఉపయోగించారా? అనే అంశంపై విచారణ జరిపేందుకు డెమోక్రటిక్ నేతలు, కమిటీ సిబ్బంది సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: అమెరికా రాజకీయాల్లో కలకలం.. షాకిచ్చిన డెమొక్రాట్!


