ట్రంప్‌కు కోర్టులో భారీ షాక్‌.. రూ.83 వేల కోట్ల దావా కొట్టివేత! | Trump loses $10 billion defamation lawsuit against Wall Street Journal | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు కోర్టులో భారీ షాక్‌.. రూ.83 వేల కోట్ల దావా కొట్టివేత!

Nov 1 2026 8:56 AM | Updated on Nov 1 2026 8:57 AM

Trump loses $10 billion defamation lawsuit against Wall Street Journal

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ఆయన పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బర్త్‌డే లేఖపై కథనం ప్రచురించిన వాల్‌స్ట్రీట్ జర్నల్‌పై ట్రంప్ వేసిన పరువు నష్టం దావాను అమెరికా న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ట్రంప్ ఏకంగా 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.83 వేల కోట్లు) పరిహారంగా చెల్లించాలని కోరారు.

2025 జులైలో వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. 2003లో ఎప్‌స్టీన్‌ 50వ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ప్రత్యేకంగా ఓ బర్త్‌డే కార్డు పంపినట్లు వెల్లడించింది. ఆ కార్డులో నగ్న మహిళ చిత్రాన్ని పోలిన బొమ్మతోపాటు అభ్యంతరకరమైన సందేశం ఉన్నట్లు పేర్కొంది. దీనిపై అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది.

ఎప్‌స్టీన్‌ పుట్టినరోజు సందర్భంగా అతడి సన్నిహితురాలు ఘిస్లేన్ మ్యాక్స్‌వెల్ ప్రత్యేకంగా ఓ ఆల్బమ్‌ను రూపొందించినట్లు జర్నల్ తన కథనంలో తెలిపింది. అందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపిన సందేశాలతోపాటు ట్రంప్ లేఖ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఆ లేఖపై ట్రంప్ సంతకం ఉందని, అందులో మహిళ శరీరాన్ని సూచించే బొమ్మతోపాటు ‘హ్యాపీ బర్త్‌డే.. ప్రతి రోజూ మరో అద్భుతమైన రహస్యంగా మారాలని కోరుకుంటున్నా’ అనే సందేశం ఉన్నట్లు వెల్లడించింది.

ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించిన ట్రంప్.. వాల్‌స్ట్రీట్ జర్నల్, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌పై పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు కథనం ప్రచురించారని ఆరోపిస్తూ 10 బిలియన్ డాలర్ల పరిహారం కోరారు. ఈ కేసులో గత ఏప్రిల్‌లోనే న్యాయమూర్తి డారిన్ గేల్స్ ట్రంప్ దాఖలు చేసిన తొలి పిటిషన్‌ను తిరస్కరించారు. అనంతరం ట్రంప్ సవరించిన పిటిషన్‌ను దాఖలు చేశారు.

తాజాగా అక్టోబర్ 31న మరోసారి విచారణ చేపట్టిన న్యాయమూర్తి డారిన్ గేల్స్.. ట్రంప్ దావాను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచురించారనే విషయాన్ని నిరూపించడంలో ట్రంప్ విఫలమయ్యారని పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో కీలకమైన 'యాక్చువల్ మాలిస్' (వాస్తవం కాదని తెలిసి కూడా దురుద్దేశంతో ప్రచురించడం) అంశాన్ని నిరూపించలేకపోయారని స్పష్టం చేశారు.

ఈ కేసును 'విత్ ప్రిజుడిస్'తో కొట్టివేయడం మరో కీలక పరిణామం. అంటే ఇదే అంశంపై ట్రంప్ మళ్లీ సవరించిన పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉండదు. గత ఏడాది అమెరికా ప్రతినిధుల సభ పర్యవేక్షణ కమిటీ కూడా ఎప్‌స్టీన్‌కు ట్రంప్ పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బర్త్‌డే సందేశం ప్రతిని విడుదల చేసింది. తాజా తీర్పుతో ట్రంప్‌కు న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఇదీ చదవండి: మాస్కోలో భారీ దాడి?.. అమెరికా హెచ్చరికతో హై అలర్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement