మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో భారీ ప్రాణనష్టానికి దారితీసే దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. ప్రముఖ మ్యూజియం, పార్క్ సముదాయమైన త్సారిట్సినో మ్యూజియం రిజర్వ్ వద్ద దాడి జరిగే ప్రమాదం ఉందని వెల్లడించింది. మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం శనివారం భద్రతా హెచ్చరిక జారీ చేసింది. దాడికి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందిందని ఎక్స్ వేదికగా ప్రకటించింది.
దాడి ముప్పు నేపథ్యంలో ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లవద్దని అమెరికా ఎంబసీ సూచించింది. అప్రమత్తంగా ఉండాలని, జనసమూహాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ ముప్పుపై రష్యా అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. దాడికి ఎవరు ప్రణాళిక రచిస్తున్నారనే విషయాన్ని అమెరికా వెల్లడించలేదు. ముప్పునకు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా బయటపెట్టలేదు. అయితే, హెచ్చరికలో పేర్కొన్న ప్రాంతం మాస్కోలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కావడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అమెరికా నుంచి అందిన సమాచారాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) ధ్రువీకరించింది. దీనిపై తగిన చర్యలు కొనసాగుతున్నాయని ఎఫ్‌ఎస్‌బీ తెలిపింది. మాస్కోలో దాడులకు సంబంధించి అమెరికా గతంలోనూ రష్యాకు నిఘా సమాచారాన్ని అందించింది. 2024 మార్చిలో ఐసిస్-కె ఉగ్రవాద సంస్థ మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌పై దాడి చేయడానికి కొన్ని వారాల ముందే అమెరికా హెచ్చరించింది. ఆ దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
మాస్కో దక్షిణ ప్రాంతంలో త్సారిట్సినో మ్యూజియం రిజర్వ్ ఉంది. ఇది పురాతన సామ్రాజ్య కాలం నాటి రాజభవనం, పార్క్ సముదాయం. ముఖ్యంగా వారాంతాల్లో పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి ప్రాంతంలో దాడి ముప్పు హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో ఫ్లోరిడాలోని తన ట్రంప్ నేషనల్ డోరల్ రిసార్ట్‌లో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని వ్యాఖ్యాత బెన్నీ జాన్సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇదీ చదవండి: రాజధానిలో టెన్షన్.. టెన్షన్.. అంతటా పోలీస్ పహరా!


