కుప్పకూలనున్న టెలిస్కోపు
భారత్‌సహా పలు ప్రాంతాల్లో కూలే అవకాశం
కేప్ కేనర్వాల్: విశ్వ రహస్యాలను ఛేదించడంలో ఇరవై ఏళ్లకుపైగా సేవలిందించిన నాసా టెలిస్కోపు ‘స్విఫ్ట్’ భూమివైపు దూసుకొస్తోంది. కాపాడేందుకు చేసిన చివరి ప్రయత్నమూ విఫలం కావడంతో అది క్రమేపీ కక్ష్య నుంచి జారిపోతూ శుక్రవారం కూలిపోనున్నట్లు నాసా ప్రకటించింది.
దాదాపు 1500 కిలోల బరువున్న ఈ టెలిస్కోపు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూ మండిపోతుందని, కొంచెం మందంగా, సీసము, టంగ్‌స్టన్‌తో చేసిన భాగాలు, అద్దాల అవశేషాలు మాత్రం భూమ్మీకు చేరతాయని నాసా చెబుతోంది. ఈ శకలాలు సముద్రంలో పడేందుకు ఎక్కువ అవకాశముందని, భారత్, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో కూలవచ్చునని నాసా అంచనా వేస్తోంది. టెలిస్కోప్ ప్రయాణ మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
విశ్వంలోని అత్యంత శక్తివంతమైన పేలుళ్లు... గామా రే బరస్ట్‌లు, నక్షత్ర పేలుళ్లు (సూపర్‌నోవా)లను గుర్తించేందుకు ‘స్విఫ్ట్’ టెలిస్కోపును నాసా 2004 నవంబర్ 20న ప్రయోగించింది. స్విఫ్ట్ 2,000కు పైగా గామా రే బరస్ట్‌లు, 1,400 సూపర్‌నోవాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు, నక్షత్రాలను మింగేసే కృష్ణ బిలాలను గుర్తించింది. ఖగోళ ఘటనలు జరిగే వైపునకు చాలా వేగంగా తిరగగల సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత కాగా.. స్విఫ్ట్ అన్న పేరు కూడా ఈ కారణంగానే వచ్చింది.
స్విఫ్ట్ టెలిస్కోపు ఏదో ఒక సమయంలో ఇది భూమ్మీదకు తిరిగి వస్తుందని తమకు తెలిసినప్పటికీ ఇలా ముక్కలవుతుందని ఊహించలేదని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త జాన్ నౌసెక్ వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా సూర్యుడిపై జరుగుతున్న కార్యకలాపాలు తీవ్రమైన నేపథ్యంలో స్విఫ్ట్ ఊహించనదానికంటే చాలా వేగంగా కిందకు జారుతూ వచ్చిందని, కక్ష్యను పెంచేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కూలిపోతోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.


