జాబిల్లిపై వింత కాంతులు? | Artemis II astronauts spotted five faint flashes on the Moon during a planned observation | Sakshi
Sakshi News home page

జాబిల్లిపై వింత కాంతులు?

Oct 9 2026 5:09 AM | Updated on Oct 9 2026 5:09 AM

Artemis II astronauts spotted five faint flashes on the Moon during a planned observation

చందమామ ఒకవైపు నిత్యం వెలుగులతో నిండి ఉంటే.. ఇంకోవైపు చీకట్లోనే ఉంటుందని అంటారు. అయితే నాసా ప్రయోగించిన ఆర్టిమిస్‌–2 వ్యోమగాములు మాత్రం చీకటితో నిండిన వైపున కూడా అక్కడక్కడా వెలుగులు కనిపించాయని అంటున్నారు. అంతేకాకుండా... చంద్రుడి ఉపరితలంపై ఐదు సూక్ష్మస్థాయి కాంతి మెరుపులను గుర్తించినట్లు నాసా వెల్లడించింది.  నాసా తాజాగా విడుదల చేసిన ‘ఆర్టెమిస్‌–2 ప్రిలిమినరీ లూనార్‌ సైన్స్‌ రిపోర్టు’లో ఈ వివరాలు ఉన్నాయి.

సూక్ష్మస్థాయి కాంతి మెరుపులు ముందు ఒక మిస్టరీలా అనిపించినప్పటికీ, విశ్లేషణ జరిపిన తరువాత వాటిని చిన్న అంతరిక్ష శిలలు (మైక్రో మీటియరాయిడ్లు)గా నాసా గుర్తించింది. చంద్రుడిని అత్యధిక వేగంతో ఢీకొట్టడం వల్ల మెరుపులు పుట్టుకొచ్చాయని నిర్ధారించారు. భూమిలా వాతావరణం లేకపోవడంతో చిన్న చిన్న ఉల్కా శకలాలు కూడా నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొంటాయని వివరించారు.అయితే జాబిల్లి నుంచి సుమారు 74 వేల కి.మీ. దూరం నుంచి కూడా వ్యోమాములు వీటిని గుర్తించగలగడం విశేష మని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. చీకట్లోంచి చూస్తూండటం వల్ల వెలుతురు స్పష్టంగా కనిపించి ఉండవచ్చునని అంచనా కట్టారు.

లో–యాంగిల్‌ సూర్యకాంతితో...
చంద్రుడిపై చీకటి, వెలుతురులు కలిసే ప్రాంతం ‘లూనార్‌ టెర్మినేటర్‌’ సమీపంలో తాము అక్కడక్కడ వెలుగు దీవులను గమనించామని వ్యోమగామి విక్టర్‌ గ్లోవర్‌ చెప్పారు. ఒరియన్‌ వ్యోమనౌక లూనార్‌ టెర్మినేటర్‌ ప్రాంతంలోని హెరŠట్జ్‌స్ప్రంగ్‌ బేసిన్, వావిలోవ్‌ బిలం పరిసరాల్లో పర్వతాలు, బిలాలు, లోయలు మరింత పెద్దవిగా కనిపించాయని ఉపరితలం కూడా కఠినంగా ఉన్నట్లు అనిపించిందని గ్లోవర్‌ వివరించారు. 

లో–యాంగిల్‌లో పడుతున్న వెలుతురు ఇందుకు కారణమని నాసా తేల్చింది. చుట్టుపక్కల ప్రాంతాలు చీకటిలో ఉంటే ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం అక్కడకక్కడా సూర్యకాంతి కనిపించిందని వ్యోమగాములు చెప్పారు. మిషన్‌ కమాండర్‌ రీడ్‌ వైజ్‌మన్‌ మాట్లాడుతూ.. టెర్మినేటర్‌ ప్రాంతం నుంచి చూసినప్పుడు చంద్రుడి చీకటివైపు ‘‘ఊహించలేనంత కఠినమైన భూభాగం మాదిరిగా’’ కనిపించిందన్నారు. ఆకాశంలో సూర్యుడు ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు కనిపించని కొండలు, లోయలను అక్కడి నీడలు స్పష్టంగా చూపించాయని వివరించారు.

2026 ఏప్రిల్‌ 1న నింగికి ఎగసిన ఆర్టెమిస్‌–2 ఏప్రిల్‌ 6న చంద్రుడి సమీపాన్ని చేరుకుంది. చందమామను చుట్టేస్తూండగా వ్యోమగాములు పరిశీలనలు నిర్వహించి ఏప్రిల్‌ 10న తిరిగి వచ్చారు. ఈ మొత్తం ప్రాజెక్టులో వ్యోమగాములు సుమారు 800 గిగాబైట్ల సమాచారాన్ని సేకరించగా నాసా దాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 11 వేలకుపైగా అధిక రెజల్యూషన్‌ ఫొటోలు, ఎనిమిదిన్నర గంటల ఆడియో, వ్యోమగాములు చేత్తో రాసిన కొన్ని అంశాలు, బొమ్మలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి. 1972లో అపోలో–11 ద్వారా మనిషి తొలిసారి జాబిల్లిపైకి అడుగు పెడితే దగ్గరగా వెళ్లింది ఇదే మొదటిసారి. అందుకే నాసా ఈ సమాచారం మొత్తాన్ని యాభై ఏళ్ల కంటే ఎక్కువ సమయం తరువాత మనుషులు ఒక ఉపగ్రహానికి సంబంధించి సేకరించిన సైన్స్‌ డేటాసెట్‌ అని అంటోంది.

– నేషనల్‌ డెస్క్, సాక్షి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement