బుధవారానికి ‘ఒక కాంతి దినం’
దూరాన్ని చేరుకోనున్న నాసా అంతరిక్ష నౌక
కేప్ కెనవెరాల్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ప్రయోగించిన అంతరిక్ష నౌక వాయేజర్–1 అరుదైన ఘనత సాధించబోతోంది. భూమి నుంచి ఒక ‘కాంతి దినం’దూరాన్ని చేరుకున్న మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్‌గా రికార్డుకెక్కబోతోంది. ఇప్పటిదాకా మానవ నిర్మిత వస్తువులన్నింటికంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వస్తువుగా చరిత్ర సృష్టించనుంది. 49 ఏళ్ల క్రితం వాయేజర్–1ను ప్రయోగించారు. 2,590 కోట్ల కిలోమీటర్లకుపైగా దూరాన్ని కాంతి దినం అంటారు.
ఈ నౌక బుధవారం కల్లా కాంతి దినాన్ని పూర్తిచేసుకోనుంది. అంతరిక్షంలోకి వేగంగా దూసుకెళ్తోంది. ఈ అంతరిక్ష నౌక పూర్తి కాంతి సంవత్సరాన్ని చేరుకోవడానికి మరో 18,000 ఏళ్లు పడుతుందని, అలాగే మరో నక్షత్రాన్ని సమీపించడానికి దానికి రెట్టింపు కంటే ఎక్కువ సమయం పడుతుందని నాసా అంచనా వేస్తోంది. వాయేజర్–1ను నక్షత్రాల మధ్య దూసుకుపోతున్న భూమి రాయబారిగా ప్రాజెక్ట్ మేనేజర్ సుజాన్ డాడ్ అభివర్ణించారు. ఇది ఒక జాతీయ సంపద అని చెప్పారు. వాయేజర్–1 బుధవారం అద్భుతమైన మైలురాయిని చేరుకోబోతోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం సూర్యాస్తమయం తర్వాత వాయేజర్ కాల్ సైన్ అయిన వి–జి–ఆర్ అనే అక్షరాలను మోర్స్ కోడ్ ఉపయోగించి రాత్రి ఆకాశంలో ప్రదర్శించబోతున్నారు. చెదురుమదురు సమస్యలు ఉన్నప్పటికీ వాయేజర్–1, దాని జంట వాయేజర్–2 గంటకు 61,000 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి దూసుకుపోతూ శాస్త్ర, ఇంజనీరింగ్ సమాచారాన్ని తిరిగి పంపుతూనే ఉన్నాయి. వాయేజర్–2 2035లో ఒక కాంతి దినం మైలురాయిని చేరుకుంటుంది. వాయేజర్–1 సౌర వ్యవస్థ నుంచి ని్రష్కమించే ముందు 1979, 1980లలో బృహస్పతి, శని గ్రహాలను దాటేసింది. 2012లో నక్షత్ర వ్యవస్థల మధ్య ఉన్న విస్తారమైన ప్రాంతానికి చేరుకుంది.


