త్వరలో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు
కొన్ని అంశాలపై జరుగుతున్న చర్చలు త్వరలో ముగుస్తాయి
ప్రయోజనకరమైన, సమతుల్యమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నాం
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి సంబంధించి టారిఫ్‌లు సహా పలు కీలక అంశాలు పరిష్కారమయ్యాయని, మిగిలిన కొన్ని అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. ‘ఫినిషింగ్ లైన్’కు చేరుకుంటున్నామని, త్వరలోనే ఒప్పందం ఖరారు కావొచ్చని తెలిపారు. శనివారం హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు.
వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు ముగింపు దశకు చేరుకుంటున్నాయని వివరించారు. మిగిలి ఉన్న అంశాలు ‘మన వైపునకు సంబంధించినవి కావు’అని అన్నారు. అమెరికా వైపు నుంచే ఎక్కువ అంశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు సంబంధించి చివరి దశలో ఉన్నామని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే చర్చల అనంతరం వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ సమావేశం కోసం మోదీ అమెరికాలో పర్యటించబోతున్నారు. ఒప్పందం విషయంలో ఇరుదేశాల నడుమ సమస్యలు పరిష్కారమయ్యాయని జైశంకర్ పేర్కొన్నారు. ఇక మిగిలి ఉన్నవి చివరి దశ సమస్యలు మాత్రమేనని వెల్లడించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో గత నెలలో భారత్‌లో పర్యటించారు. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకొనే విషయంలో ఇరు పక్షాలు అత్యంత సమీపంలోకి వచ్చాయని స్పష్టంచేశారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాలు 2025 ఆరంభం నుంచి చర్చలు జరుపుతున్నాయి. ప్రయోజనకరమైన, సమతుల్యమైన వాణిజ్య ఒప్పందాన్ని భారత్ కోరుకొంటోందని జైశంకర్ స్పష్టంచేశారు. వాణిజ్య ఒప్పందాన్ని ఉభయ దేశాల ప్రయోజనాల దృష్ట్యా ఒక విశాల కోణంలో చూడాలని సూచించారు.


