మార్కో రూబియోతో చర్చించనున్న జైశంకర్
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మధ్య అక్టోబర్ 20న ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ముంబై వేదికగా జరిగే ఈ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ఇందులో భాగంగా ఇంధన, రక్షణ రంగాలు, వాణిజ్యం, పెట్టుబ డులు, నూతన సాంకేతికత అంశాలపై ఇరు దేశాల నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. అనంతరం ముంబైలో జరిగే అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవ వేడుకలకు జైశంకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మార్కో రూబియో ఐదు రోజుల ప్రాంతీయ పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ సందర్శించిన తర్వాత భారత్కు రానున్నారు. భారత్లో ముంబై, గుజరాత్లోని జామ్నగర్లను మాత్రమే సందర్శించనున్నారు. ఈ చర్చలకు న్యూఢిల్లీ వేదికను తప్పించడం మీద ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎంఈఏ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ స్పందించారు. విదేశీ ప్రతినిధులకు దేశ రాజధానిలోనే కాకుండా వివిధ నగరాల్లో ఆతిథ్యం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ నెల 19–20 తేదీల్లో అధికారిక పర్యటన నిమిత్తం ముంబై రానున్న యూఏఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు ఆతిథ్యం అనంతరం రూబియోతో చర్చిస్తారని తెలిపారు.


