దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. ముంబైలో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో వోర్లి తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. విలాసవంతమైన అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లతో పాటు భారీ అద్దె ఒప్పందాల్లోనూ ఈ ప్రాంతం అగ్రస్థానంలో నిలుస్తోంది. కార్పొరేట్ సంస్థలు, సంపన్న పెట్టుబడిదారులు ఇక్కడి ప్రీమియం నివాసాలపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా నమోదైన ఓ అపార్ట్‌మెంట్ అద్దె ఒప్పందం ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తోంది.
నెలకు రూ.28.50 లక్షల అద్దె
లైట్‌హౌస్ లగ్జరీ నివేదిక ప్రకారం.. 2026 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ముంబైలో నెలకు రూ.20 లక్షలకు పైగా అద్దె ఉన్న ఎనిమిది లగ్జరీ నివాసాల లీజు ఒప్పందాలు నమోదయ్యాయి. వీటిలో ఆరు వోర్లిలోనే ఉండటం విశేషం. మిగిలినవి బ్రీచ్ క్యాండీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ఎనిమిది ఆస్తుల సగటు నెలవారీ అద్దె రూ.23.31 లక్షలుగా ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఎనిమిది ఒప్పందాల్లో ఏడింటిలో కంపెనీలే అద్దెదారులుగా ఉన్నాయి.
వోర్లిలోని త్రీ సిక్స్టీ వెస్ట్‌లో ఒక అపార్ట్‌మెంట్ అత్యధికంగా నెలకు రూ.28.50 లక్షల అద్దెకు వెళ్లింది. అంటే ఏడాదికి అద్దె ఖర్చు రూ.3.42 కోట్లు. సెప్టెంబర్ 28న నమోదైన ఈ ఒప్పందంలో ఐవీఎల్ ధున్‌సేరి పెట్రోకెమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అద్దెదారుగా ఉంది. ఆస్తి యజమాని డెరైవ్ ట్రేడింగ్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మూడేళ్ల లీజు ఒప్పందంలో భాగంగా రూ.1.71 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. రెండో ఏడాది అద్దె రూ.29.92 లక్షలకు, మూడో ఏడాది రూ.31.42 లక్షలకు పెరిగేలా ఒప్పందం చేసుకున్నారు. మూడేళ్లలో మొత్తం అద్దె చెల్లింపులు సుమారు రూ.10.78 కోట్లకు చేరనున్నాయి.
ఫోర్ సీజన్స్ ప్రైవేట్ రెసిడెన్సెస్‌లో నువో ఆర్టిసన్ ఫ్యామిలీ ఆఫీస్ LLP నెలకు రూ.27.50 లక్షలకు అపార్ట్‌మెంట్‌ను లీజుకు తీసుకుంది. ఒబెరాయ్ 360 వెస్ట్‌లోనూ మూడు అత్యధిక అద్దె ఒప్పందాలు నమోదయ్యాయి. వీటి నెలవారీ అద్దెలు రూ.28.50 లక్షలు, రూ.23 లక్షలు, రూ.22 లక్షలుగా ఉన్నాయి. వోర్లిలోని మధులీ సీహెచ్‌ఎస్, ప్రైమ్ సీజే రెసిడెన్సీల్లోనూ వరుసగా రూ.22 లక్షలు, రూ.21 లక్షల నెలవారీ అద్దెతో ఒప్పందాలు జరిగాయి.
రూ.5,558 కోట్ల ఇళ్ల విక్రయాలు
వోర్లి అద్దె మార్కెట్‌లోనే కాకుండా ఇళ్ల అమ్మకాల విషయంలోనూ ముందుంది. లైట్‌హౌస్ లగ్జరీ, జాప్కీ రూపొందించిన 2026 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం (ఏప్రిల్–సెప్టెంబర్) నివేదిక ప్రకారం.. వోర్లిలో రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన ఇళ్లకు సంబంధించి 275 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.5,558 కోట్లు. ఒక్కో ఇంటి సగటు లావాదేవీ విలువ రూ.20.2 కోట్లుగా ఉంది.
ముంబైలోని రూ.5 కోట్లకు పైబడిన లగ్జరీ గృహాల విక్రయాల మొత్తం విలువలో వోర్లి వాటా సుమారు 17 శాతంగా ఉంది. ఇదే సమయంలో ముంబై నగరవ్యాప్తంగా ఈ ధరల విభాగంలో 3,145 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.32,623 కోట్లు.
మరోవైపు రూ.50 కోట్లకు పైబడిన ఇళ్ల విక్రయాలు కూడా పుంజుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇలాంటి 9 ఇళ్లు అమ్ముడవగా, రెండో త్రైమాసికంలో ఆ సంఖ్య 20కి చేరింది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య మొత్తం 29 అల్ట్రా లగ్జరీ ఇళ్ల విక్రయాలు జరిగాయి. వీటి విలువ రూ.2,536 కోట్లు. దీంతో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో వోర్లి అత్యంత కీలకమైన అల్ట్రా లగ్జరీ నివాస ప్రాంతంగా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది.
ఇదీ చదవండి: ‘3BHK ఇల్లు కొనేశానోచ్’.. ఐటీ ఉద్యోగిని సక్సెస్ స్టోరీ వైరల్


