టాటా గ్రూప్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించడంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో ఇప్పుడు న్యాయపోరాటానికి కూడా సిద్ధమైంది.
నోయెల్ టాటా నేతృత్వంలోని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, రతన్ టాటా ట్రస్ట్‌లు చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న టాటా గ్రూప్ అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఈ వివాదానికి ప్రధాన కారణం సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశం. ఈ సమావేశంలో చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. ఆయన కొత్త పదవీకాలం 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ నిర్ణయం తీసుకున్న విధానం సరైనది కాదని టాటా ట్రస్ట్స్ వాదిస్తోంది.
కంపెనీ నిబంధనల ప్రకారం ఛైర్మన్ పునర్నియామకానికి ట్రస్టులు నామినేట్ చేసిన డైరెక్టర్లలో మెజారిటీ మద్దతు ఉండాలని, కానీ ఆ సమావేశంలో అలాంటి మద్దతు లభించలేదని చెబుతోంది. సెప్టెంబర్ 17న జరిగిన సమావేశంలో ట్రస్టులు నామినేట్ చేసిన డైరెక్టర్ల మధ్యే భిన్నాభిప్రాయాలు వచ్చాయి.
నోయెల్ టాటా చంద్రశేఖరన్ కొనసాగింపును వ్యతిరేకించగా, వేణు శ్రీనివాసన్ మాత్రం మద్దతు తెలిపారు. దీంతో సమావేశానికి అధ్యక్షత వహించిన హరీష్ మన్వానీ కాస్టింగ్ ఓటు వేయడంతో చంద్రశేఖరన్ పునర్నియామకానికి ఆమోదం లభించింది. అయితే అవసరమైన మెజారిటీ లేకుండా కాస్టింగ్ ఓటుతో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని టాటా ట్రస్ట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందుకే ఆ తీర్మానాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని కోర్టును కోరాలని భావిస్తోంది.
ఇదీ చదవండి: ఒక్కరోజులోనే సీన్ రివర్స్.. పసిడి ధరల్లో కీలక మార్పు!
ఈ వ్యవహారంలో నవంబర్ 30న జరగనున్న టాటా సన్స్ బోర్డు సమావేశం కీలకంగా మారనుంది. భవిష్యత్తులో కూడా డైరెక్టర్ల మధ్య ఇలాంటి విభేదాలు తలెత్తే అవకాశం ఉందని టాటా ట్రస్ట్స్ ఆందోళన చెందుతోంది. అందుకే.. ఆ సమావేశానికి ముందే కోర్టు జోక్యం కోరాలని నిర్ణయించినట్లు సమాచారం.


