మౌనం వీడిన రతన్ టాటా సోదరుడు.. టాటా గ్రూప్‌లో కొత్త వివాదం! | Jimmy Tata Takes on Noel Says Tata Sons Listing Will End Culture of Secrecy | Sakshi
Sakshi News home page

మౌనం వీడిన రతన్ టాటా సోదరుడు.. టాటా గ్రూప్‌లో కొత్త వివాదం!

Nov 16 2026 11:47 AM | Updated on Nov 16 2026 11:55 AM

Jimmy Tata Takes on Noel Says Tata Sons Listing Will End Culture of Secrecy

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం తర్వాత, టాటా గ్రూప్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ పాలనకు సంబంధించి భిన్నాభిప్రాయాలు బయటపడుతున్నాయి. దీనిపై రతన్ టాటా తమ్ముడు జిమ్మీ నావల్ టాటా (85) తన అభిప్రాయాలను వెల్లడించడం చర్చనీయాంశమైంది.

ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే జిమ్మీ టాటా.. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరోసారి కొనసాగించాలని పేర్కొన్నారు. అంతే కాకుండా.. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనే అంశానికి కూడా ఆయన మద్దతు తెలిపారు. ఈ వైఖరి టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా అభిప్రాయాలకు భిన్నంగా ఉండటం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.

జిమ్మీ టాటా.. సర్ రతన్ టాటా ట్రస్ట్‌లో 1989 నుంచి శాశ్వత ట్రస్టీగా కొనసాగుతున్నారు. అయితే.. ఆయన సాధారణంగా ట్రస్ట్ సమావేశాలకు హాజరుకావడం, ఓటింగ్‌లో పాల్గొనడం వంటివి చేయరు. తాజాగా మరో ట్రస్టీతో జరిగిన అధికారిక సంభాషణలో.. టాటా గ్రూప్ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా గతంలో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రతన్ టాటా నాయకత్వంలో టీసీఎస్ మార్కెట్‌లోకి రావడం వల్ల టాటా సన్స్‌కు ప్రయోజనం కలిగిందని గుర్తుచేశారు. ఆర్బీఐ నిబంధనలను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ను చిన్న సంస్థలుగా విభజించే ప్రయత్నాలు చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు సంస్థతో పాటు వాటాదారుల ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

టాటా ట్రస్ట్స్ పాలనపై జిమ్మీ అసంతృప్తి?
రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్స్‌లో పాలన, నిర్ణయాల విధానంపై కూడా జిమ్మీ టాటా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డుల్లో ఒకే కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు ఉండటానికి బదులుగా, ఒక్కరికే ప్రాతినిధ్యం కల్పించడం మంచిదని ఆయన సూచించారు.

జిమ్మీ టాటా వాటా ఎంతంటే?
టాటా సన్స్‌లో జిమ్మీ టాటాకు సుమారు 0.81 శాతం వాటా ఉంది. అంటే 3,262 షేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ వాటా విలువ దాదాపు రూ.7,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు.. సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు టాటా సన్స్‌లో 23.56 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో జిమ్మీ టాటా.. ట్రస్ట్ సమావేశాలకు హాజరై ఓటింగ్‌లో పాల్గొంటే, కీలక నిర్ణయాలపై ఆయన అభిప్రాయం ప్రభావం చూపే అవకాశం ఉందని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి.

చంద్రశేఖరన్‌కు మద్దతు కీలకమవుతుందా?
టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ కొనసాగింపుతో పాటు.. కంపెనీ లిస్టింగ్ అంశం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు విషయాల్లో జిమ్మీ టాటా తన వైఖరిని వెల్లడించడం సంస్థ భవిష్యత్తుపై చర్చకు మరింత ఊతమిచ్చింది. అయితే ఈ పరిణామాలు టాటా గ్రూప్‌లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు తెర వెనుకే ఉన్న జిమ్మీ టాటా తన అభిప్రాయాలను బయటపెట్టడంతో టాటా ట్రస్ట్స్‌లో భవిష్యత్తు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై అందరి దృష్టి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement