టాటా బోర్డురూమ్‌లో మరోసారి విభేదాలు | Tata Sons Rejects Noel Tata Boardroom Recording Demand What Really Happened | Sakshi
Sakshi News home page

టాటా బోర్డురూమ్‌లో మరోసారి విభేదాలు

Nov 14 2026 2:37 PM | Updated on Nov 14 2026 2:52 PM

Tata Sons Rejects Noel Tata Boardroom Recording Demand What Really Happened

బోర్డు సమావేశాల రికార్డింగ్‌ విషయంలో అభ్యంతరాలు

భారతీయ కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌లో పాలనా వ్యవహారాలు, బోర్డు నిర్ణయాల పారదర్శకత మరోసారి చర్చనీయాంశంగా మారాయి. టాటా సన్స్‌ ఛైర్మన్‌ నోయల్‌ టాటా చేసిన అభ్యర్థనను సంస్థ తిరస్కరించినట్లు కథనాలొస్తున్నాయి. టాటా గ్రూప్‌ వంటి అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యంలో బోర్డు సమావేశాల నిర్వహణ, కీలక నిర్ణయాల నమోదు, డైరెక్టర్ల మధ్య సమాచార మార్పిడి ఎంత ప్రాధాన్యమైనవో ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారం కంపెనీ బోర్డు సమావేశాల్లో చర్చించే అంశాలు వ్యూహాత్మక వ్యాపార నిర్ణయాలకు సంబంధించింది కావడంతో వాటి రికార్డింగ్‌ విషయంలో గోప్యత కీలకంగా మారుతుంది.

ఏం జరిగిందంటే..

2026 సెప్టెంబర్‌ 17న జరిగిన టాటా సన్స్‌ బోర్డు సమావేశమే ఈ వివాదానికి మూలం. ఈ సమావేశంలో ఎన్‌.చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా తిరిగి నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2017 నుంచి టాటా గ్రూప్‌ నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రశేఖరన్‌కు రెండో విడత పదవీకాలం కల్పించే ఈ నిర్ణయాన్ని నోయల్‌ టాటా వ్యతిరేకించారు. బోర్డులో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఏకైక డైరెక్టర్‌ ఆయనే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో సమావేశంలో అసలు ఏం చర్చ జరిగింది? పునర్నియామక ప్రతిపాదన ఏ విధంగా బోర్డు ముందుకు వచ్చింది? తన అభ్యంతరాలను సమావేశంలో ఎలా పరిగణించారు? వంటి అంశాలపై స్పష్టత కోసం నోయల్‌ టాటా పలుమార్లు సంస్థను సంప్రదించారు. సెప్టెంబర్‌ 18, సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 8, అక్టోబర్‌ 26 తేదీల్లో లేఖల ద్వారా సమావేశానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగులను అందించాలని కోరారు. అక్టోబర్‌ 26న పంపిన లేఖలో పునర్నియామక నిర్ణయం తీసుకున్న విధానంపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

టాటా సన్స్‌ సమాధానం

నోయల్‌ అభ్యర్థనకు టాటా సన్స్‌ కంపెనీ సెక్రటరీ సుప్రకాశ్‌ ముఖోపాధ్యాయ నవంబర్‌ 9న రాతపూర్వకంగా స్పందించారు. వ్యక్తిగతంగా హాజరై నిర్వహించే బోర్డు సమావేశాల ఆడియో, వీడియో రికార్డింగులను డైరెక్టర్లకు అందించే విధానం సంస్థలో గతంలో లేదని స్పష్టం చేశారు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది డైరెక్టర్లు ఆన్‌లైన్‌ ద్వారా సమావేశానికి హాజరైనప్పుడు వీడియో రికార్డింగ్‌ తప్పనిసరి అవుతుందని, ప్రత్యక్ష సమావేశాల విషయంలో అలాంటి నిబంధన లేదని సంస్థ వివరించింది.

అంతేకాకుండా, సెప్టెంబర్‌ 17 సమావేశానికి సంబంధించిన ముసాయిదా మినిట్స్‌ను అక్టోబర్‌ 1న బోర్డు యాప్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపింది. డైరెక్టర్ల సూచనలను పరిశీలించి మార్పులు చేసినట్లు పేర్కొంది. చంద్రశేఖరన్‌ పునర్నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని కంపెనీ చట్టంలోని సెక్షన్‌ 117 ప్రకారం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు సమర్పించినట్లు కూడా వెల్లడించింది.

అసలు విభేదం ఏమిటి?

టాటా సన్స్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ కావాలా వద్దా అన్నది ప్రధాన అంశం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ఐపీఓ లిస్టింగ్‌ అవసరమయ్యే పరిస్థితిని చంద్రశేఖరన్‌ ప్రస్తావిస్తుండగా, లిస్టింగ్‌ను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోలేదన్నది నోయల్‌ టాటా అభిప్రాయంగా వార్తా కథనాలు వెల్లడించాయి. చంద్రశేఖరన్‌ నాయకత్వంలో చేపట్టిన డిజిటల్‌ వ్యాపారాలు, ఎయిరిండియా, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పెట్టుబడుల పనితీరుపైనా నోయల్‌ టాటా ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఏడాది తిరగకముందే బిజినెస్‌ మూసివేత.. కట్‌ చేస్తే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement