రతన్ టాటా, మోదీ ( ఫైల్ ఫోటో )
భారతీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌లో చోటుచేసుకుంటున్న కార్పొరేట్ పరిణామాలపై ఆరు ప్రధాన పార్సీ, జోరాస్ట్రియన్ సామాజిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. టాటా సన్స్ మాతృ సంస్థగా ఉన్న టాటా ట్రస్ట్‌ల నాయకత్వంలోని ప్రస్తుత యాజమాన్య నమూనాను, గ్రూప్ నిస్వార్థ సామాజిక సేవా విభాగాన్ని (ఫిలాంత్రోపిక్ లెగసీ) పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సంయుక్త లేఖ రాశాయి. ఈ వివాదం కేవలం కార్పొరేట్ రంగానికి లేదా వాటాదారుల ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాదని, దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన ఒక సంస్థ భవిష్యత్తుతో ముడిపడి ఉందని పార్సీ సంస్థలు తమ లేఖలో స్పష్టం చేశాయి.
రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలు - వివాద నేపథ్యం
టాటా సన్స్ సంస్థను పబ్లిక్ లిస్టింగ్ చేయకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగానే కొనసాగించాలని టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ భావిస్తున్నప్పటికీ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సీఐసీ) నిబంధనల కింద సర్టిఫికేట్‌ను రద్దు చేసేందుకు ఆర్‌బీఐ నిరాకరించింది. ఆర్‌బీఐ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇటీవలే టాటా సన్స్ బోర్డు నిర్ణయించింది.
దీర్ఘకాలిక లక్ష్యాలు - సామాజిక బాధ్యత
టాటా సన్స్‌లో మెజారిటీ వాటా కలిగి ఉన్న టాటా ట్రస్ట్‌ల యాజమాన్య నమూనా వల్లనే దశాబ్దాలుగా నైతిక విలువలు, సామాజిక బాధ్యత, దీర్ఘకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యత లభించిందని లేఖలో పేర్కొన్నారు. డిఫెన్స్, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి కీలక రంగాల్లో సంస్థ సర్వీసులు దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని వివరించారు.
స్టాక్ మార్కెట్ స్వల్పకాలిక అంచనాలు, వ్యాపార ప్రయోజనాల ఒత్తిడి వల్ల ఈ నైతిక విలువలకు భంగం కలగకూడదని అవి హెచ్చరించాయి. బాంబే పార్సీ పంచాయత్ (బీపీపీ), ఫెడరేషన్ ఆఫ్ జోరాస్ట్రియన్ అసోసియేషన్స్ ఆఫ్ నార్త్ అమెరికా, వరల్డ్ జోరాస్ట్రియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఈ లేఖపై సంతకాలు చేశాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టాటా గ్రూప్ విశిష్టతను కాపాడాలని ఈ నిర్ణయంతో భాగస్వామ్య వర్గాలను కోరాయి.
ఇదీ చదవండి: రుబియో జామ్‌నగర్ పర్యటన.. సంకేతాలు ఏమిటి?


