టాటా వ్యవహారంపై రాహుల్, నిర్మల మాటా మాట! | Nirmala Sitharaman accuses Rahul Gandhi of stoking distrust over Tata issue | Sakshi
Sakshi News home page

టాటా వ్యవహారంపై రాహుల్, నిర్మల మాటా మాట!

Oct 29 2026 5:13 AM | Updated on Oct 29 2026 5:13 AM

Nirmala Sitharaman accuses Rahul Gandhi of stoking distrust over Tata issue

టాటా సంస్థను నాశనం చేస్తున్నారన్న రాహుల్‌ 

పారిశ్రామికవేత్తల మౌనంపైనా ప్రశ్నలు   

ఘాటుగా సమాధానమిచ్చిన సీతారామన్‌ 

అన్ని అంశాలను రాజకీయం చేస్తున్నారని మండిపాటు

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రముఖమైన సంస్థ ‘టాటా’ను నాశనం చేస్తున్నారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. రాహుల్‌ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఎక్స్‌ వేదికగా జరిగిన ఈ మాటల యుద్ధమిప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.  

టాటా సన్స్‌ సంస్థకు ఎవరు నేతృత్వం వహించాలన్న విషయంలో ఇటీవలి కాలంలో కొంత వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనివల్ల కంపెనీ బోర్డులోని ట్రస్టీలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలొస్తున్నాయి. టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ను మళ్లీ నియమిస్తూ సెప్టెంబరు 17న చేసిన తీర్మానాన్ని సవాలు చేసిన విషయం తెలిసిందే. టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ నోయెల్‌ టాటా కొన్ని రోజుల క్రితం  ఈ సవాలు చేశారు. 

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ బుధవారం ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ... టాటా సంస్థను నాశనం చేసేస్తున్నా పారిశ్రామికవేత్తలు పల్లెత్తు మాట మాట్లాడలేకపోతున్నారని, ఈ నేరాలకు తాము తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎంతకాలం ఇలా మౌనంగా కూర్చుంటారని వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రశ్నించారు. వాళ్లు మిమ్మల్ని సొంతం చేసుకునేంత వరకా? అని విమర్శించారు. 

భారతీయ వ్యాపారాలంటే ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షాల ఆటవస్తువులు కావని, మీకు ధైర్యం లేకపోయినా మాకుందని.... ఈ నేరాలన్నింటికీ న్యాయం జరిగేలా చేస్తామని తన పోస్టులో తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ విమర్శలపై ఘాటుగా స్పందించారు. రాహుల్‌ ఇప్పుడు పారిశ్రామికవేత్తలను కూడా తనతో కలుపుకుని అవిశ్వాసాన్ని, విషపు సంస్కృతిని వ్యాపింప జేస్తున్నారని విమర్శించారు. అన్నింటినీ రాజకీయం చేయడం రాహుల్‌ మానుకోవాలని హితవు పలికారు. భారతీయ పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తల విజయాలను తక్కువ చేసి చూపడం రాహుల్‌కు అలవాటైపోయిందని అన్నారు. 

నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు పెట్టుబడులను ప్రోత్సహించేవని, పరిశ్రమలకు, సంస్థలకు మద్దతిచ్చేవని స్పష్టం చేస్తూ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన మీరు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సూచిస్తున్నా. అలాగే వాణిజ్య, న్యాయపరమైన అంశాలను కూడా నేరాలుగా పరిగణించడం అంగీకారయోగ్యమైనవి కావు’’అని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ దశాబ్దాలుగా దేశంలో పారిశ్రామిక స్ఫూర్తిని నీరుగార్చిందని, లైసెన్స్, కోటా రాజ్‌లతో కోట్లాది మంది భారతీయులు పేదరికంలో మగ్గిపోయేందుకు కారణమైందని విమర్శించారు.  

సీతారామన్‌కు రాహుల్‌ సమాధానం
తన పోస్టుపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ ఇంకో పోస్టు ద్వారా తిప్పికొట్టారు. ‘‘ప్రియమైన శ్రీమతి సీతారామ... 1. ఏ న్యాయ, వాణిజ్య అంశం టాటా ట్రస్ట్, టాటా సన్స్‌లు అమిత్‌ షా ఇంట్లో సమావేశమయ్యేలా చేసింది? 2.నెంబర్‌ వన్‌ ‘సన్నిహితుడు’రంగ ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి... టాటాలో ఏ ముక్క అతడికి దక్కనుంది? చివరగా... మీకు సంబంధించిన ముగ్గురు నలుగురు ‘సన్నిహితులు’మినహాయించి దేశంలోని మిగిలిన వ్యాపారవేత్తలందరూ మీ అందరినీ ఇప్పటికే ద్వేషిస్తున్నారు. వాళ్లను ఉసికొల్పాల్సిన అవసరమే లేదు’’అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement