తమిళనాడులోని తేని జిల్లాలో ఇటీవల ఖైదీలు జైలు నుంచి పరారైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకేసారి 17 మంది ఖైదీలు వ్యూహాత్మకంగా జైలు సిబ్బందిని బోల్తా కొట్టించి పరారైన ఈ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యూహాత్మక దళాలను సమన్వయం చేస్తూ చేపట్టిన విస్తృత గాలింపు చర్యల ఫలితంగా మంగళవారం నాటికి పరారైన 17 మంది ఖైదీల్లో 13 మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రత్యేక డ్రోన్లను ఉపయోగించారు.
నకిలీ వైద్య అత్యవసరం అంటూ..
తేని సబ్-జైలులో సోమవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఈ నాటకీయ ఘటన చోటుచేసుకుంది. జైలులోని ఒక సెల్‌లో ఉన్న ఖైదీల్లో ఒకరు అకస్మాత్తుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు అరుస్తూ నటించారు. ఖైదీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని నమ్మిన డ్యూటీలోని జైలు గార్డు స్టాలిన్ ప్రభు సహాయం చేయడానికి సెల్ లోపలికి వెళ్లారు. అదే సమయంలో ప్లాన్ ప్రకారం మిగతా ఖైదీలు ఒక్కసారిగా విరుచుకుపడి గార్డుపై దాడి చేశారు. అతనిపై దుప్పటి కప్పి, తీవ్రంగా కొట్టి సెల్ కీస్‌ను బలవంతంగా లాక్కున్నారు. అడ్డువచ్చిన ఇతర సిబ్బందిపై దాడులకు పాల్పడి ప్రధాన ద్వారం గుండా 17 మంది అండర్‌ట్రయిల్ ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటనలో గార్డులకు తీవ్ర గాయాలయ్యాయి.
అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల నిఘాతోనే వేట
ఖైదీలు పారిపోవడంతో అప్రమత్తమైన రాష్ట్ర పోలీసు యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. దక్షిణ జోన్ పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏకంగా 17 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తేని, దిండిగల్, మధురై జిల్లాలతో పాటు పొరుగున ఉన్న కేరళలోని ఇడుక్కి సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా ఏర్పాటు చేశారు. జైలు వెనుక భాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో, పొదల్లో ఖైదీలు తలదాచుకున్నట్లు గుర్తించారు.
ఈ గాలింపు చర్యల్లో పోలీసులు డ్రోన్ సర్వైలెన్స్‌ను ప్రధాన అస్త్రంగా మలచుకున్నారు. దట్టమైన అడవుల్లో సాధారణంగా మానవ కంటికి చిక్కని ప్రాంతాలలోనూ డ్రోన్ల ద్వారా సంకేతాలు పంపి ఖైదీల కదలికలను పసిగట్టారు. ఈ టెక్నాలజీ సహకారంతోనే అడవుల్లో నక్కిన ఖైదీల జాడను పోలీసులు వేగంగా గుర్తించి చుట్టుముట్టారు. కొందరు నిందితులు రైల్వే స్టేషన్ల ద్వారా ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ మార్గాలను ముందే మూసివేయడంతో వారి వ్యూహం అడ్డుకట్టపడింది.
అధికారులపై వేటు
ఈ భారీ భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సహా మొత్తం 9 మంది జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. పరారైన మిగిలిన నలుగురు ఖైదీలను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: 120 కి.మీ వేగంతో వెళ్లినా చలాన్లు ఉండవు! కానీ..


