స్క్రీన్‌లోంచి సువాసనలు! | A major breakthrough by a team of scientists from Ohio State University in the United States | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌లోంచి సువాసనలు!

Oct 27 2026 4:10 AM | Updated on Oct 27 2026 4:10 AM

A major breakthrough by a team of scientists from Ohio State University in the United States

ఫలించిన శాస్త్రవేత్తల ప్రయత్నం

‘సెంట్రోనిక్‌’ టెక్నాలజీ ఆవిష్కరణ 

మార్కెట్‌లోకి అప్పుడే కాదు  

ప్రస్తుతానికి 5 రకాల వాసనలే!  

(సాక్షి స్పెషల్‌ డెస్క్‌)  : ఇంటర్నెట్‌ ఇకపై కేవలం ఆడియోలు, వీడియోలను మాత్రమే కాదు.. మనకు ఇష్టమైన సువాసనలను కూడా మైళ్ల దూరాన్నుంచి క్షణాల్లో అందించబోతోంది! ఈ దిశగా అమెరికాలోని ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం భారీ ముందడుగు వేసింది. చైనాకు చెందిన డాక్టర్‌ చున్యు యాంగ్‌ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘సెంట్రోనిక్‌’ అనే ఈ ఆఘ్రాణ సాంకేతికత వివరాలను ప్రముఖ సైన్స్‌ జర్నల్‌ ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’ తన తాజా సంచికలో ప్రచురించింది.  

వేల మైళ్ల దూరం నుంచి.. 
అజయ్‌ తన ల్యాప్‌టాప్‌ ముందు కూర్చుని, అమెరికాలో ఉన్న స్నేహితుడు విక్రమ్‌తో వీడియో కాల్‌ మాట్లాడుతున్నాడు. అప్పుడే విక్రమ్‌ టేబుల్‌ మీదకు వేడివేడిగా పొగలు కక్కుతున్న కాఫీ కప్పు వచ్చింది. అంతే! ఇక్కడ ఇండియాలోని అజయ్‌ ముక్కుపుటాలను, అక్కడ అమెరికాలో విక్రమ్‌ టేబుల్‌ మీదకు వచ్చిన కమ్మటి కాఫీ పరిమళం గమ్మత్తుగా తాకింది. ‘ఓయ్‌ విక్రమ్, నీ కాఫీ సువాసన భలే బాగుంది’ అన్నాడు అజయ్‌ ముక్కులు ఎగబీలుస్తూ! ఈ అద్భుతాన్ని సాధ్యం చేసే టెక్నాలజీనే.. ‘సెంట్రోనిక్‌’. 

ఎలా పని చేస్తుంది? 
సెంట్రోనిక్‌ టెక్నాలజీ వ్యవస్థలోని ‘ఎలక్ట్రానిక్‌ నోస్‌’.. వాసనలను గుర్తించి, ఏఐ సహాయంతో వాటిని డిజిటల్‌ డేటాగా మారుస్తుంది. ఈ సమాచారం నెట్‌ ద్వారా అవతలి వైపు ఉన్న రిసీవింగ్‌ పరికరానికి చేరుతుంది. అక్కడ ఉన్న చిన్న లిక్విడ్‌ సెంట్, మైక్రో–అటామైజర్స్‌ (స్ప్రేయర్లు) ద్వారా ‘అచ్చం అలాంటి వాసనే’ గదిలో వ్యాపిస్తుంది. అంటే, డిజిటల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అవతలి పరికరం కాఫీలా అనిపించే సువాసనను వెదజల్లుతుంది. ఒహాయో స్టేట్‌ వర్సిటీ, చైనాలోని జెజియాంగ్‌ ల్యాబొరేటరీ పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ‘సెంట్రోనిక్‌’ ఒక ఆఘ్రాణ వ్యవస్థ. ఇది ఈ–నోస్‌ (ఎలక్ట్రానిక్‌ నాసిక), మెషీన్‌–లెర్నింగ్‌ వర్గీకరణ, క్లౌడ్‌ డేటా ప్రసారం, రిమోట్‌ సువాసన వెదజల్లే పరికరాల సమ్మిళితం. 

వాసన నేరుగా ప్రసారం కాదు 
సెంట్రోనిక్‌ టెక్నాలజీ వివిధ హార్డ్‌వేర్‌ భాగాలపై ఆధారపడి పని చేస్తుంది. ఇందులోని ఈ–నోస్‌ పరికరం వాసనల్లోని రసాయన సమ్మేళనాలను గుర్తించి, విశ్లేషించే ఒక పోర్టబుల్‌ గ్యాస్‌ సెన్సర్‌ శ్రేణి. ఇది సుమారు 6 అంగుళాల వ్యాసం కలిగి ఉంటుంది. రెండో వైపు, సువాసన విడుదల చేసే రిసీవర్లు మణికట్టు పట్టీలు, నెక్లెస్‌లుగా; కప్పులకు అమర్చగలిగినవిగా ఉంటాయి. ఇవి పీజోఎలెక్ట్రిక్‌ టెక్నాలజీని (యాంత్రిక పీడనాన్ని విద్యుచ్ఛక్తిగా, విద్యుచ్ఛక్తిని యాంత్రిక కదలికగా మార్చే సాంకేతికత) ఉపయోగించి, ఇంచుమించు సరిపోలే సువాసనలను స్థానికంగా వెదజల్లే ఐదు స్ప్రేల అమరికతో ఉంటాయి. అయితే మూలానికి సంబంధించిన వాసన అణువులు ఇంటర్నెట్‌ ద్వారా ప్రసారం కావు. దానికి బదులుగా, స్థానికంగా సంబంధిత వాసనను ఉద్దీపన చేయటానికి డిజిటల్‌ డేటా ప్రసారం అవుతుంది.  

వైద్య రంగానికి ఉపయోగం 
ప్రస్తుతానికి ‘సెంట్రోనిక్‌’ పరికరం కేవలం ఐదు రకాల వాసనలను (కాఫీ, కేక్, బెర్రీ, ఆరెంజ్, రెడ్‌ వైన్‌) మాత్రమే గుర్తించి పంపగలదు. అలాగే, వేర్వేరు వాసనలు కలిసిపోయినప్పుడు వాటిని కచ్చితంగా వేరు చేసి గుర్తించడంపై పరిశోధనలు జరగాల్సి ఉంది. ఈ పరికరాన్ని చిన్న సైజులోకి కుదించటం, తక్కువ ఖర్చుతో తయారు చేయడం, దీనిని వాడేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించడం వంటి అంశాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ఇది మొబైల్‌ ఫోన్లలో ఒక ఫీచర్‌గా రావడానికి మరి కాస్త సమయం పడుతుంది. అయినప్పటికీ భవిష్యత్తులో ఆ¯న్‌లైన్‌ షాపింగ్, వర్చువల్‌ రియాలిటీ, వైద్య రంగంలో (వాసన కోల్పోవటాన్ని పరీక్షించడానికి) ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement