ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శనివారం చైనాలో పర్యటించారు. ఇటీవలే ప్రారంభమైన కొత్త సరిహద్దు వంతెన మీదుగా చైనాలోని డాండోంగ్ నగరానికి చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన ఈ వంతెన ప్రారంభమైన కొద్ది రోజులకే కిమ్ దానిపై ప్రయాణించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన సందర్భంగా ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత వాంగ్ హునింగ్‌తో సమావేశమయ్యారు.
చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లో ఉన్న డాండోంగ్ నగరం.. ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. ఇరు దేశాలను కలిపే అమ్నోక్ నది (చైనాలో యాలు నదిగా పిలుస్తారు) మీదుగా నిర్మించిన కొత్త వంతెనను కిమ్ దాటుకుని అక్కడికి చేరుకున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రకారం.. వాంగ్ హునింగ్‌తో కలిసి కిమ్ ఒక కార్ల తయారీ పరిశ్రమను సందర్శించారు. అనంతరం కొరియా యుద్ధ స్మారకాన్ని సందర్శించి, ఆ యుద్ధంలో మరణించిన చైనా సైనికులకు నివాళులర్పించారు.
వాంగ్ హునింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు. చైనా ప్రజా రాజకీయ సంప్రదింపుల సదస్సు జాతీయ కమిటీకి ఆయన అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. చర్చల సందర్భంగా చైనాకు ఉత్తర కొరియాపై ఉన్న దీర్ఘకాల మద్దతుకు కిమ్ కృతజ్ఞతలు తెలిపినట్లు జిన్హువా పేర్కొంది. ఇరు దేశాల మధ్య చారిత్రక స్నేహాన్ని మరింత విస్తరించడంతోపాటు, ఆచరణాత్మక సహకారాన్ని పెంచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తద్వారా రెండు దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుతాయని అభిప్రాయపడ్డారు. పర్యటన ముగిసిన తర్వాత కిమ్ స్వదేశానికి తిరిగి వెళ్లగా, వాంగ్ హునింగ్ ఆయనకు వీడ్కోలు పలికారు.
12 ఏళ్ల తర్వాత అందుబాటులోకి వంతెన
ఉత్తర కొరియాలోని సినుయిజు నగరాన్ని, చైనాలోని డాండోంగ్‌ను కలిపే ఈ నాలుగు వరుసల వంతెన పొడవు 3,026 మీటర్లు. చైనా సుమారు 310 మిలియన్ డాలర్ల పెట్టుబడితో దీన్ని నిర్మించింది. 2014లోనే నిర్మాణం పూర్తయినప్పటికీ, ఉత్తర కొరియా వైపు అనుసంధాన రహదారులు, సుంకాల తనిఖీ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు పూర్తికాకపోవడంతో ప్రారంభం అనేక సంవత్సరాలు వాయిదా పడింది. చివరకు అక్టోబర్ 15న ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించారు.
ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల ఉత్తర కొరియా, చైనా మధ్య సరకు రవాణా, వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు.
కొరియా యుద్ధ వార్షికోత్సవానికి ముందు పర్యటన
కొరియా యుద్ధం 1950-1953లో ఉత్తర కొరియాకు మద్దతుగా చైనా సైనికులు పాల్గొన్న సందర్భాన్ని ఇరు దేశాలు అక్టోబర్ 25న స్మరించుకుంటాయి. ఈ నేపథ్యంలో కిమ్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. కిమ్‌కు చైనాలో ఇది ఆరో పర్యటన.
మరోవైపు, వచ్చే నెలలో చైనాలోని షెన్‌జెన్‌లో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి హాజరుకానున్నారు. ఉత్తర కొరియా నేతతో చర్చలు జరపాలని ట్రంప్ ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, ప్యాంగ్యాంగ్ నుంచి స్పందన రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా, ఉత్తర కొరియా మధ్య పెరుగుతున్న సహకారం భవిష్యత్తులో ప్రాంతీయ దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: బైక్‌ను ఢీకొట్టి, బైకర్‌ను కిడ్నాప్ చేసి.. చంపేసి..


