పరిశోధనా రంగంలో మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు
అమెరికా, యూరప్ శాస్త్రవేత్తల్లో తగ్గుతున్న ఉద్యోగ సంతృప్తి
భారత్, చైనా శాస్త్రవేత్తల్లో రెట్టింపైన ఆశాభావం
సంతృప్తి కేవలం భారీ వేతనాలపైనే ఆధారపడి లేదు
‘నేచర్’ సర్వేలో వెల్లడి
ప్రపంచ పరిశోధనా రంగానికి సంబంధించి భౌగోళిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయని ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘నేచర్’ తాజా నివేదిక స్పష్టం చేసింది. ఉద్యోగంపై శాస్త్రవేత్తలకున్న సంతృప్తి, భవిష్యత్తుపై వారికున్న నమ్మకం తదితర అంశాలపై ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 మంది పరిశోధకుల అభిప్రాయాలను సేకరించి నిర్వహించిన తాజా సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా, పలు ఐరోపా దేశాల శాస్త్రవేత్తలతో పోలిస్తే భారత్, చైనాలకు చెందిన పరిశోధకులే తమ వృత్తిపరమైన భవిష్యత్తుపై అత్యంత ఆశాభావంతో ఉన్నట్లు సర్వే పేర్కొంది.
యువ శాస్త్రవేత్తల్లో విశ్వాసం..
గతంలో శాస్త్ర, పరిశోధనా రంగాల్లో పాశ్చాత్య దేశాలు తిరుగులేని ఆధిపత్యం చెలాయించగా, ప్రస్తుతం ఆ సమతుల్యత ఆసియా దేశాల వైపు మొగ్గు చూపుతోందని నివేదిక విశ్లేషించింది. భారత్‌లో ఇటీవల అంతరిక్ష రంగం, ఏరోస్పేస్, బయోటెక్నాలజీ వంటి కీలక విభాగాల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం, పెట్టుబడులు ఊపందుకోవటమే భారతీయ యువ శాస్త్రవేత్తల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. స్కైరూట్ ఏరోస్పేస్ వంటి దేశీయ స్టార్టప్‌ల విజయాలు భారత పరిశోధనా పర్యావరణంలో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నట్లు నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.
వేతనాలతో నిమిత్తం లేదు..
పరిశోధకుల సంతృప్తి కేవలం భారీ వేతనాలపైనే ఆధారపడి ఉండటం లేదని సర్వే తేల్చింది. ఉద్యోగ భద్రత, పనిచేసే చోట లభించే స్వేచ్ఛ, వారు చేసే పరిశోధన సమాజానికి ఎంతమేర ఉపయోగపడుతోందనే సంతృప్తే వారిని అత్యంత ఉత్సాహంగా ఉంచుతోందని తేలింది. అదే సమయంలో, పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. పెరుగుతున్న నిధుల కోతలు, విద్యాసంస్థల్లో తీవ్రమైన పోటీ, ఉద్యోగ అభద్రత అక్కడి శాస్త్రవేత్తల్లో నైరాశ్యానికి దారితీస్తున్నాయి. ఈ మార్పులు భవిష్యత్ ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనలను ఆసియా నడిపించబోతోందనటానికి స్పష్టమైన సంకేతాలని ‘నేచర్’ సంపాదకీయంలో విశ్లేషించింది.
– సాక్షి స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు నోటీసులు..


