మామ్ ఇన్‌ఫ్లూన్సర్‌లకు నోటీసులు
సోషల్ మీడియా ప్రమోషన్‌ల మీద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిఘా
సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్ల హవా విపరీతంగా పెరిగింది. ఈ ట్రెండ్ నెట్టింటి నుంచి నట్టింట్లోకి వచ్చేసింది. పిల్లల పెంపకంలో సూచనలకు పరిమితం కాకుండా పసిపిల్లల ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేసే వరకు వెళ్లింది. ఏ మాత్రం శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్లు కూడా చంటిబిడ్డల ఆహారపదార్థాలకు ప్రచారం కల్పిస్తున్నారు.
ఇలాంటి ‘మామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల’ మీద ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిఘా పెట్టింది. శిశువుల పాల ప్రత్యామ్నాయాలు, ఆహార ఉత్పత్తులను నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్న వారికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గట్టి వార్నింగ్ ఇస్తూ నోటీసులు జారీ చేసింది.
ఇన్‌ఫ్లూయెన్సర్ల బాధ్యత ఏమిటి?
ప్రమోట్ చేసే ముందు పరిశీలించాలి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం సెలబ్రిటీలు కానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కానీ తాము ప్రమోట్ చేసే ఉత్పత్తుల నాణ్యత, దాని వెనుక ఉన్న శాస్త్రీయతను కచ్చితంగా తనిఖీ చేయాలి. తమకు తెలియని విషయాల్లో సంబంధితరంగంలో నిపుణుల సలహాతో నిర్ధారించుకోవాలి.
కేవలం తయారీదారులు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి చెప్పడం సరికాదు. అలాగే లైఫ్‌స్టైల్ సలహా పేరుతో బేబీ ఫుడ్‌ను సిఫారసు చేయడం కూడా తప్పే. ఇకపై అది కూడా చెల్లదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని ఇన్‌ఫ్లూయెన్సర్‌లు మర్చిపోకూడదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం!
పసిపిల్లల ఆహారపదార్థాలను తయారు చేసే ప్రముఖ కంపెనీలు నెస్లే ఇండియా, అబాట్, న్యూట్రీషియా, మీడ్ జాన్సన్‌లతోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ ఫుడ్ ప్రొడెక్ట్స్‌ను ప్రమోట్ చేసిన కొందరు కంటెంట్ క్రియేటర్లకు, ఇరా ఫాతిమా వంటి ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసింది.
ప్రచారంలో భాగంగా ఆ ఉత్పత్తులను తీసకోవడం వల్ల పిల్లల ఎదుగుదల, రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధి, సులభంగా జీర్ణమవడం వంటి ప్రయోజనాలుంటాయని చెప్పడాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తీవ్రంగా పరిగణిస్తోంది. శాస్త్రీయ ఆధారాలు లేకుండా వాస్తవ విరుద్ధమైన వాదనలతో బేబీ ఫార్ములా ఉత్పత్తులను ప్రచారం చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
ఇదో మార్కెటింగ్ వ్యూహం!
తల్లిదండ్రులు, ముఖ్యంగా కొత్త తల్లులు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలను గుడ్డిగా నమ్ముతారనే ఉద్దేశంతోనే కంపెనీలు ఈ మార్కెటింగ్ వ్యూహాలను వాడుతున్నాయి. అయితే, పిల్లల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్‌ఫ్లూయెన్సర్లు కేవలం సోషల్ మీడియా రీల్స్ కోసమే కాకుండా, ప్రజా ఆరోగ్యానికి కట్టుబడి వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. తమవంతుగా సామాజిక బాధ్యత వహించాలి. తాము ప్రచారం చేయడానికి సిద్ధమైన ఆహారాన్ని తమ పిల్లలకు పెడతామా అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
చట్టాలు ఏం చెబుతున్నాయి?
చంటిపిల్లల ఆహారం విషయంలో తల్లులను తప్పుదోవ పట్టించేలా ప్రమోషన్లు చేయకూడదు. ‘చంటిపిల్లలకు పాలకు ప్రత్యామ్నాయాల చట్టం (ఐఎమ్‌ఎస్)– 1992’ ప్రకారం శిశువుల పాల ప్రత్యామ్నాయాలు, ఫీడింగ్ బాటిళ్లు మొదలైన వాటిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రచారం చేయడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి.
ఫుడ్స్ ఫర్ ఇన్‌ఫాంట్ న్యూట్రిషన్ (ఎఫ్‌ఎస్‌ఎస్) రెగ్యులేషన్స్, 2020 ప్రకారం పిల్లల ఆహార ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగ్, ప్రకటనల నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
నిరూపణ లేని ప్రకటనలు నిషేధం. ప్రచారం చేసినందుకు బహుమతులు, ఆర్థిక ప్రయోజనాలనాశించి ఉత్పత్తుల వల్ల అద్భుతాలు జరుగుతాయని చెప్పడం వినియోగదారులను, ముఖ్యంగా కొత్త తల్లులను మోసం చేయడమే అవుతుంది.
– సాక్షి స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: భూమికి బదులు మరో భూమి


