భూమి మీద జీవం ఉండలేకపోతే?
మరో భూమి కోసం శాస్త్రవేత్తల అన్వేషణ!
‘బాబోయ్! భూమి వేడెక్కిపోతోంది. బతకలేకపోతున్నాం’అని తరచూ అంటుంటాం. శాస్త్రవేత్తలు మాత్రం అలా అని ఊరుకోవడం లేదు, ఈ భూమ్మీద బతకలేకపోతే బతకడానికి మరొక ప్రదేశం ఏదైనా ఉందా అని శోధిస్తున్నారు. దట్టమైన వాతావరణాల నుంచి, సూర్యుని కంటే బిలియన్ల సంవత్సరాలు ఎక్కువ కాలం మండే నక్షత్రాల వరకు.. భూమి కంటే ఒక గ్రహాన్ని జీవానికి మరింత అనుకూలంగా మార్చగల అంశాలపై పరిశోధన చేస్తున్నారు.
‘సూపర్ హ్యాబిటబుల్‘(అతి నివాసయోగ్యమైన) గ్రహాలుగా పిలవబడే ఈ ఊహాజనిత ప్రపంచాలు.. భూమి కంటే కొద్దిగా పెద్దవిగా, భారీగా ఉండొచ్చు. వాటిలో ద్రవరూపంలో నీరు, దట్టమైన వాతావరణాలు, సుదీర్ఘ కాలంపాటు స్థిరంగా ఉండే శీతోష్ణస్థితులు ఉండొచ్చు. మన గ్రహం ఆవల జీవం కోసం చేసే అన్వేషణలో అసలు భూమిని మాత్రమే ‘బెంచ్‌మార్క్‘గా పరిగణించాలా? అని ప్రశ్నిస్తూ 2014లో ప్రచురితమైన ఒక పత్రంలో ఖగోళ శాస్త్రవేత్తలు రెనే హెల్లర్, జాన్ ఆర్మ్‌్రస్టాంగ్ ఈ భావనను ప్రతిపాదించారు.
సూపర్ హ్యాబిటబుల్ గ్రహాల ప్రత్యేకతలు
పరిమాణం, ద్రవ్యరాశిలో ఇవి భూమి కంటే సుమారు 20–30% వెడల్పుగా, రెట్టింపు ద్రవ్యరాశితో ఉండొచ్చు.
బలమైన గురుత్వాకర్షణ వల్ల దట్టమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్ద ఇనుప కేంద్రకం ఉండి, హానికరమైన కాస్మిక్ రేడియేషన్ నుంచి రక్షించే బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది.
జీవ వైవిధ్యమూ సాధ్యమే. తక్కువ లోతు ఉన్న సముద్రాలు, పొడవైన ద్వీప సమూహాలు వివిధ రకాల ఆవాసాలను సృష్టిస్తాయి. ఫలితంగా ఇవి భూమి కంటే ఎక్కువ జీవ వైవిధ్యాన్ని పోషించగలవని పరిశోధకులు భావిస్తున్నారు.
నారింజరంగు నక్షత్రాలు
ఈ గ్రహాలు, పరిభ్రమించే నక్షత్రాలు కూడా అత్యంత కీలకమైనవి. సూర్యుని కంటే చల్లగా ఉండే నారింజ రంగు నక్షత్రాలైన కె–డ్వార్ఫ్‌లు తమ ఇంధనాన్ని నెమ్మదిగా దహించి, పది బిలియన్ల సంవత్సరాలపాటు స్థిరంగా ఉండగలవు. ఇది జీవం పరిణామం చెందడానికి, వైవిధ్యం సాధించడానికి ఎక్కువ సమయం ఇస్తుంది. దీనికి విరుద్ధంగా, సూర్యుడు ప్రకాశవంతంగా మారే కొద్దీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సుమారు 50 కోట్ల సంవత్సరాల్లో భూమిని జీవానికి అననుకూలంగా మార్చగలవని శాస్త్రవేత్తల అంచనా.
కిరణజన్య సంయోగక్రియ సాధ్యమే
‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీ’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం... ఆస్ట్రోబయాలజిస్ట్ ఐవా విలోవిచ్, ఆమె సహచరులు కె–డ్వార్‌్ఫ, సౌర కాంతి కింద గార్డెన్ క్రెస్ మొక్క చాలా బాగా పెరిగిందని కనుగొన్నారు. అలాగే కె–డ్వార్ఫ్ నక్షత్రం వికిరణం కింద సైనోబాక్టీరియా కూడా సమర్థవంతంగా మనుగడ సాగించింది.
భవిష్యత్ మిషన్లు–అన్వేషణలు
అనువైన గ్రహాలను గుర్తించి, జీవ కార్యకలాపాలను సూచించే రసాయన సంకేతాల కోసం వాటి వాతావరణాన్ని పరిశీలించడం.
2027లో ప్రయోగించనున్న యూరోపియన్‌స్పేస్ ఏజెన్సీ మిషన్, ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను కనుగొని అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, చిలీలో నిర్మాణంలో ఉన్న ఎక్స్‌ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్, నాసా ప్రతిపాదించిన హ్యాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ (2040లలో) వంటివి మరింత వివరమైన పరిశీలనలకు అవకాశం కల్సిస్తాయి.
ప్రస్తుతానికి అత్యంత నివాసయోగ్యమైన గ్రహాలనేవి ఒక పరికల్పనగానే మిగిలిపోయినప్పటికీ.. ఈ ఆలోచన గ్రహాంతర జీవుల అన్వేషణలో కీలకమైన నిజాన్ని గుర్తుచేస్తుంది. అదేమిటంటే.. భూమికి బదులుగా అన్వేíÙంచిన మరో నివాసయోగ్యమైన గ్రహం భూమిలా కనిపించకపోవచ్చు!
– సాక్షి స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: రెక్కల గుర్రం


