రెక్కల గుర్రం | Uttarakhand Almora Man Develops Electric Flying Car With Help From Internet | Sakshi
Sakshi News home page

రెక్కల గుర్రం

Oct 24 2026 6:21 AM | Updated on Oct 24 2026 6:21 AM

Uttarakhand Almora Man Develops Electric Flying Car With Help From Internet

ఓ సామాన్యుడి అసామాన్య ఆవిష్కరణ

ఎగిరే కారు తయారు చేసిన రవీ టమ్‌టా

ఆయన పేరు రవీ టమ్‌టా. స్వస్థలం దేవభూమి ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా. చదివింది సాదాసీదా బీఏ మాత్రమే. అయితేనేం, అక్షరాలా అద్భుతమే సాధించి చూపించారు. ఎలాంటి ఇంజనీరింగ్‌ పరిజ్ఞానమూ లేకుండానే ఏకంగా ఎగిరే ఎలక్ట్రిక్‌ కారు తయారు చేశారు!! అబ్బురపరిచే ఈ ఆవిష్కరణకు కావాల్సిన సాంకేతిక తదితర పరిజ్ఞానమంతటినీ ఆయన కేవలం ఇంటర్నెట్‌ ద్వారా అందిపుచ్చుకోవడం విశేషం! 

ఎగిరే కారును రూపొందించే క్రమంలో ఎన్నిసార్లు వైఫల్యాలు ఎదురైనా టమ్‌టా ఏనాడూ కుంగిపోలేదు. ఎక్కడా పట్టువిడవలేదు. పైపెచ్చు ప్రతి వైఫల్యం నుంచీ పాఠాలు నేర్చుకున్నారు. నిత్యం తనకు తాను పదును పెట్టుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని పరిశోధనలు చేస్తూ, ఒక్కో అడ్డంకినీ దాటుతూ వచ్చారు. అలా ఒకటీ రెండేళ్లు కాదు, ఏకంగా 13 ఏళ్ల పాటు పట్టువిడవని విక్రమార్కుని మాదిరిగా ప్రయత్నించి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. 

కృషి ఉంటే మనుషులు రుషులౌతారన్న వేటూరి మా(పా)టను నిజం చేయడమే గాక తెలివితేటలకు, చదువుకు సంబంధమే లేదని కూడా రుజువు చేశారు. సింగిల్‌ సీటుతో కూడిన తన ఎగిరే కారుకు హపిదా స్కైనెక్స్‌ అని పేరు పెట్టుకున్నారు టమ్‌టా. గత ఆగస్టులోనే విజయవంతంగా టెస్ట్‌ డ్రైవ్‌ కూడా ముగించారు. ఇక ప్రభుత్వపరంగా కూడా పరీక్షలు జరిగి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతులు లభించడమే తరువాయి.

పదేళ్ల తపస్సు 
ఉత్తరాఖండ్‌లో అక్షరాలా స్వర్గాన్ని తలపించే అల్మోరా హిమ సానువుల్లో ప్రఖ్యాత జాగేశ్వర్‌ ధామ్‌ సమీపంలోని కఫ్లీఖాన్‌ అనే కుగ్రామం టమ్‌టా స్వస్థలం. ఆకాశాన్ని చుంబించే అక్కడి మంచుకొండల్లో ప్రయాణం స్థానికులకు నిత్య నరకమే. ముఖ్యంగా జీవన్మరణ పరిస్థితుల్లో అత్యవసరంగా ఆస్పత్రులకు చేరుకోవడమైతే అక్షరాలా పెను సవాలే. ఈ పరిస్థితులే ఎగిరే కారు రూపొందించేలా టమ్‌టాను ప్రేరేపించాయి. సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఎందుకంటే ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఊళ్లోనే సాగింది. అనంతరం నైనాటాల్‌లో బీఏ చేశారు. ఆర్థిక వనరులు అంతకన్నా లేవు. కానీ ఈ పరిమితులేవీ ఆయన్ను ఆపలేకపోయాయి.

ఇంటర్నెటే గురువు 
టమ్‌టా తండ్రి హరీశ్‌ రామ్‌ ఓ మెకానిక్‌. అలా ఊహ తెలిసినప్పటి నుంచీ వాహనాల మధ్యే పెరిగిన టమ్‌టా, ఆ అనుభవమే పెట్టుబడిగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయనకు ఇంటర్నెటే గురువైంది. అందులో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఎగిరే కారు రూపకల్పన దిశగా ముమ్మర పరిశోధనలు మొదలు పెట్టారు. ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో ఒక్కో అడుగూ వేస్తూ సాగారు. ఎన్ని చెప్పినా, ఎగిరే కారంటే ఆషామాషీ వ్యవహారం అసలే కాదు.

 డిజైన్‌ మొదలుకుని బ్యాటరీ పనితీరు, వాహన స్థిరత్వం, భద్రత దాకా ప్రతిదీ పెను సవాలే. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వచ్చారు టమ్‌టా. అందుకోసం ప్రతి వైఫల్యాన్నీ ఎప్పటికప్పుడు అన్ని కోణాల నుంచి సమీక్షించుకున్నారు. అలా ఆ వైఫల్యాలనే విజయ సోపానాలుగా మలచుకుంటూ వచ్చారు. పలు ప్రయత్నాల అనంతరం మల్టీరోటార్‌ డ్రోన్ల తరహా టెక్నాలజీ సాయంతో నడిచే ఎలక్ట్రిక్‌ మోటార్లు, ప్రొపెల్లర్ల సాయంతో అనుకున్నది సాధించారు.  

ఇవీ ప్రత్యేకతలు 
→ ఎగిరే కారు ‘హైపిడా’విశేషాలు అన్నీ ఇన్నీ కావు...

→ ఇది రన్‌వేతో నిమిత్తమే లేకుండా హెలికాప్టర్‌ మాదిరిగా ఉన్నచోటి నుంచే నిట్టనిలువుగా ఎగిరేలా, దిగగలదు.  

→ దీని తయారీకి అత్యంత తేలికైన ఫ్రేమ్‌ను ఉపయోగించారు టమ్‌టా. 
→ ఇందులో ఒకటే సీటుంటుంది. ఒకరకంగా అదే కాక్‌పిట్‌ కూడా.

→ ఇది ఎలక్ట్రిక్‌ వెహికల్‌. కనుక ఖరీదైన ఏవియేషన్‌ ఫ్యూయల్, ఎథనాల్‌ వంటివి వాడాల్సిన జంఝాటమే లేకుండా ఎంచక్కా ఇ–బ్యాటరీ సాయంతో నడుస్తుంది. కాలుష్యానికి ఆస్కారమే ఉండదన్నమాట.

→ ట్రాన్స్‌పరెంట్‌ అద్దాల్లోంచి డ్రైవర్‌కు బయటి ప్రపంచం,  బయటి నుంచి చూసేవాళ్లకు డ్రైవర్‌ ఎంచక్కా కనిపిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement