జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్ భారత మార్కెట్లోకి సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ కారు ‘మినీ కూపర్ ఎస్‌ఈ’ని లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.53.90 లక్షలు. కంప్లీట్లీ బిల్ట్ (సీబీయూ) యూనిట్ల రూపంలో ఇది భారత్‌కు దిగుమతి అవుతుంది.
ఇందులో 54.2 కేడబ్ల్యూహెచ్ (కిలోవాట్ అవర్) బ్యాటరీ ఉంది. ఒక సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 402 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీ 95 కిలోవాట్ల వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. తద్వారా కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీని 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 160 కిలోవాట్ల (218 హెచ్‌పీ) శక్తిని, 330 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.7 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ‘మినీ యాప్’ ద్వారా ఛార్జింగ్ ప్రక్రియను పర్యవేక్షించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ తర్వాత మినీ బ్రాండ్ నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ మోడల్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న ‘మినీ’ డీలర్‌షిప్‌ల వద్ద ఈ కారు బుకింగ్‌లు మొదలయ్యాయి. డిసెంబర్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ వెల్లడించింది.
ఇదే కార్యక్రమంలో కంపెనీ ‘మినీ కూపర్ ఎస్‌ఈ పాల్ స్మిత్ ఎడిషన్’ (రూ.56.40 లక్షలు), ‘మినీ కూపర్ ఎస్ పాల్ స్మిత్ ఎడిషన్’ (రూ.55.75 లక్షలు), ‘మినీ కన్వర్టిబుల్ పాల్ స్మిత్ ఎడిషన్’ (రూ.61.50 లక్షలు) ప్రత్యేక మోడళ్లనూ ఆవిష్కరించింది.
ఎఫ్‌టీఏ అండతో ‘మినీ’ అమ్మకాల జోరు
భారత్-బ్రిటన్ స్వేచ్ఛాయిత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)తో ఈ క్యాలెండర్ ఏడాదిలో (2026) తమ ‘మినీ’ బ్రాండ్ కార్ల విక్రయాలు దాదాపు రెట్టింపు వృద్ధితో 1,200-1,500 యూనిట్లకు చేరతాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘గత 4–5 ఏళ్లుగా మినీ వార్షిక విక్రయాలు 700–800 యూనిట్ల వద్దే కొనసాగాయి.
కానీ ఈ ఏడాది అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే 1,000 యూనిట్ల మార్క్‌ను దాటేశాం. డిసెంబర్ విక్రయాలను బట్టి ఏడాదిలో 70–100% వృద్ధి నమోదవుతుంది. ఎఫ్‌టీఏ వల్లే త్వరగా వెయ్యి కార్లను విక్రయించగలిగాము. ధరలు ఎక్కువగా ఉంటే ఇన్ని కార్లు అమ్ముడయ్యేవి కావు’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.


