అఫర్డబుల్‌ ఇళ్ల నిర్వచనాన్ని మార్చాలి | Credai for tweaking affordable housing definition, doubling price cap to Rs 90L | Sakshi
Sakshi News home page

అఫర్డబుల్‌ ఇళ్ల నిర్వచనాన్ని మార్చాలి

Nov 28 2026 5:05 AM | Updated on Nov 28 2026 5:05 AM

Credai for tweaking affordable housing definition, doubling price cap to Rs 90L

 

ధర పరిమితిని రూ. 90 లక్షలకు పెంచాలి 

ప్రస్తుత పరిమితి రూ.45 లక్షలు 

ప్రీ–బడ్జెట్‌ విష్‌లిస్ట్‌లో క్రెడాయ్‌ సూచన

న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో గృహాల లభ్యతను పెంచే దిశగా, ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్లుగా అఫర్డబుల్‌ ఇళ్ల నిర్వచనాన్ని మార్చాలని కేంద్రానికి రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్‌ కోరింది. ధర పరిమితిని రూ. 90 లక్షలకు పెంచాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కి సంబంధించిన ప్రీ–బడ్జెట్‌ విష్‌లిస్టును కేంద్రానికి సమరి్పంచింది. ప్రస్తుతం ఈ ధర పరిమితి రూ. 45 లక్షలుగా ఉంది. 

2018లో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో అఫర్డబుల్‌ ఇళ్ల వాటా 54 శాతంగా ఉండగా ప్రస్తుతం 20 శాతానికి పడిపోవడం ఆందోళనకరమైన విషయమని క్రెడాయ్‌ పేర్కొంది. దీన్ని పరిష్కరించేందుకు జీఎస్‌టీ, ఆదాయ పన్ను, ప్రాధాన్య రంగ రుణాలకు సంబంధించి ప్రాంతాన్ని బట్టి నిర్దిష్ట నిర్వచనాన్ని ఇవ్వాలని కోరింది. 

నోటిఫై చేసిన మెట్రోల్లో రెరా కార్పెట్‌ ఏరియా పరిమితిని 70 చ.మీ.లుగా, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో 90 చ.మీ.లుగా, మిగతా ప్రాంతాల్లో 120 చ.మీ.లుగా నిర్ణయించాలని పేర్కొంది. అఫర్డబుల్‌ ఇళ్లపై జీఎస్‌టీ తక్కువగా ఉంటుంది కాబట్టి, ధర పరిమితిని పెంచడం వల్ల డిమాండ్‌ కూడా పెరుగుతుందని వివరించింది. అఫర్డబుల్‌ ఇళ్లపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లేకుండా ఒక్క శాతం జీఎస్‌టీ ఉండగా, పూర్తయిన యూనిట్లపై జీఎస్‌టీ విధించడం లేదు. 

ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలి.. 
అందుబాటు ధరల్లోని ఇళ్ల సరఫరాను పెంచే దిశగా కొత్త సెక్షన్‌ 142ఏ (పాత సెక్షన్‌ 80–ఐబీఏ) కింద ప్రోత్సాహకాలను మళ్లీ ప్రవేశపెట్టాలని క్రెడాయ్‌ కోరింది. 2027 ఏప్రిల్‌ నుంచి 2032 మార్చి వరకు ఆమోదం పొందిన, అర్హత గల ప్రాజెక్టులపై వచ్చే లాభాల మీద 100% పన్ను మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించింది. 

పట్టణీకరణతో భారత్‌లో గృహాల అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, అఫర్డబుల్‌ హౌసింగ్‌కి డిమాండ్‌ భారీగా ఉంటోందని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ పటేల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అఫర్డబుల్‌ హౌసింగ్‌ నిర్వచనాన్ని మార్చాల్సి ఉందన్నారు. కొనుగోలుదారులకు ధరపరంగా వెసులుబాటు లభించేలా, ప్రాజెక్టులను లాభదాయకంగా మార్చేలా, డెవలప్‌మెంట్‌ కోసం స్థలాలను అందుబాటులోకి తీసుకురావడంలో అడ్డంకుల తొలగింపుకు ఈ సూచనలు ఉపయోగపడతాయని శేఖర్‌ పటేల్‌ వివరించారు. 1999లో ఏర్పాటైన క్రెడాయ్‌లో 20 రాష్ట్రాల్లోని 230 సిటీ చాప్టర్లవ్యాప్తంగా 13,000కు పైగా డెవలపర్లకు సభ్యత్వం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement