రిజిస్ట్రేషన్ రద్దు ఇక ఆటోమేటిక్..
రీఫండ్ దరఖాస్తులకు కొత్త ఫార్మాట్
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో డిసెంబర్ 1 నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. వ్యాపారులు తమ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకునే ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ వివరాల సవరణలు, రీఫండ్ దరఖాస్తుల విధానంలోనూ కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోంది. చిన్న వ్యాపారులు, ఎగుమతిదారులకు అనవసరమైన అధికారిక జాప్యాలను తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ నంబర్ 08/2026–సెంట్రల్ టాక్స్ ప్రకారం, డిసెంబర్ 1 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు దరఖాస్తులను నిర్దేశిత అర్హతలు ఉంటే ఆన్‌లైన్‌లో పోర్టల్ ద్వారానే పరిష్కరిస్తారు.
ఆటోమేటిక్ రద్దు విధానం
కొత్త నిబంధనల ప్రకారం, రిజిస్ట్రేషన్ రద్దు కోరే పన్ను చెల్లింపుదారులు సంబంధిత రిటర్నులు, స్టేట్‌మెంట్లు సమయానికి సమర్పించి పన్ను, వడ్డీ, ఫీజులు, జరిమానాలు తదితర బకాయిలన్నీ చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. రద్దు ధ్రువీకరణను FORM GST REG-38 ద్వారా జారీ చేస్తారు. అయితే, పెండింగ్ రిటర్నులు లేదా బకాయిలు ఉన్నట్లయితే దరఖాస్తును పన్ను అధికారి పరిశీలనకు పంపుతారు. కాంపోజిషన్ పథకం కింద ఉన్నవారు FORM GST CMP-08 స్టేట్‌మెంట్లను విధిగా సమర్పించాలి.
వివరాల సవరణలకు వేగవంతమైన మార్గం
వ్యాపారం పేరు, స్వరూపం, అదనపు వ్యాపార స్థలం వంటి వివరాల సవరణలను పోర్టల్ ఆటోమేటిక్‌గా అంగీకరిస్తుంది. సీజీఎస్టీ నిబంధనల్లోని రూల్ 14ఏ కింద సరళీకృత విధానంలో రిజిస్ట్రేషన్ పొందిన వారికి ప్రధాన వ్యాపార స్థలం మార్పు కూడా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది. ఇతర సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఈ మార్పు అధికారుల ఆమోదంతోనే కొనసాగుతుంది.
రీఫండ్ దరఖాస్తులకు..
డిసెంబర్ 1 నుంచి సవరించిన FORM GST RFD-01 అందుబాటులోకి వస్తుంది. ఇందులో HSN/SAC కోడ్లు, పన్ను రేట్లకు అదనపు కాలమ్‌లు ఉంటాయి. మర్చంట్ ఎగుమతిదారులకు చేసిన సరఫరాలపై పేరుకుపోయిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ రీఫండ్, ఎగుమతి వస్తువుల ధర పెంపుపై అదనంగా చెల్లించిన ఐజీఎస్టీ రీఫండ్ అనే రెండు కొత్త కేటగిరీలను జీఎస్టీఎన్ అడ్వైజరీలో ప్రకటించింది.
ఇదీ చదవండి: 12 ఏళ్లుగా గుట్టుగా గోల్డ్‌లో పెట్టుబడి.. తల్లిదండ్రులు షాక్!


