ఇల్లు మారిన వినియోగదారుడి ఎల్‌పీజీ కనెక్షన్‌ను నిబంధనల ప్రకారం బదిలీ చేయాల్సిన గ్యాస్ పంపిణీదారు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏకంగా కనెక్షన్‌నే రద్దు చేయడంపై కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాధితుడి పాత కనెక్షన్‌ను తక్షణమే పునరుద్ధరించి కొత్త చిరునామాకు బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు రూ.20 వేల పరిహారం చెల్లించాలని సదరు గ్యాస్ ఏజెన్సీని ఆదేశించింది.
హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్–మల్కాజిగిరిలో నివసించిన 50 ఏళ్ల వ్యక్తి ఇటీవల కర్నూలుకు మారారు. తనకున్న గ్యాస్ గృహ వినియోగ కనెక్షన్‌ను కర్నూలుకు బదిలీ చేయాలని ఏజెన్సీని సంప్రదించగా సేవా రుసుము కింద రూ.300 వసూలు చేశారు. అయితే, బదిలీ ప్రక్రియ పూర్తి చేయకపోగా కనీస సమాచారం ఇవ్వకుండా కనెక్షన్ రద్దు చేసి టెర్మినేషన్ ఫారమ్ చేతిలో పెట్టారు. వాట్సాప్‌లో సంప్రదించగా కొత్త కనెక్షన్ తీసుకోవాలని సూచించడంతో బాధితుడు కమిషన్‌ను ఆశ్రయించారు.
ఏజెన్సీ తీరుపై కమిషన్ ఆగ్రహం
విచారణకు ఏజెన్సీ ప్రతినిధులు హాజరుకాకపోవడం, కనెక్షన్ రద్దుకు సరైన ఆధారాలు సమర్పించకపోవడాన్ని కమిషన్ అధ్యక్షుడు కరణం కిషోర్ కుమార్, సభ్యుడు ఎన్.నారాయణరెడ్డి తప్పుబట్టారు. గృహ సిలిండర్ల కొరత, కొత్త కనెక్షన్ల జారీపై పరిమితులు ఉన్న ప్రస్తుత తరుణంలో పాత కనెక్షన్ రద్దు చేసి కొత్తది తీసుకోవాలని చెప్పడం వినియోగదారుడి హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ సేవాలోపమేనని పేర్కొంటూ తీర్పు వెలువరించారు.
45 రోజుల్లో పరిహారం చెల్లింపు
ఆయిల్ మార్కెటింగ్ సంస్థ నిబంధనలకు లోబడి పాత కనెక్షన్‌ను పునరుద్ధరించి కర్నూలు అధీకృత పంపిణీదారుకు బదిలీ చేయాలని కమిషన్ ఆదేశించింది. మానసిక వేదనకు రూ.15 వేలు, న్యాయ ఖర్చుల కింద రూ.5 వేలు కలిపి మొత్తం రూ.20 వేలను ఉత్తర్వులు అందిన 45 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. బదిలీ సమయంలో వినియోగదారులు రసీదులు, దరఖాస్తులు, వాట్సాప్ సంభాషణలను ఆధారాలుగా భద్రపరచుకోవాలని ఈ తీర్పు స్పష్టమైన సందేశమిస్తోంది.
ఇదీ చదవండి: 12 ఏళ్లుగా గుట్టుగా గోల్డ్‌లో పెట్టుబడి.. తల్లిదండ్రులు షాక్!


