గూగుల్‌, మెటాకు భారీ జరిమానా! | Australia Big Tech Crackdown Google Meta Face Massive Fines | Sakshi
Sakshi News home page

గూగుల్‌, మెటాకు భారీ జరిమానా!

Nov 24 2026 7:38 PM | Updated on Nov 24 2026 7:44 PM

Australia Big Tech Crackdown Google Meta Face Massive Fines

ఆన్‌లైన్‌ వేదికలపై హానికర కంటెంట్‌, సోషల్‌ మీడియా వ్యసనం, పిల్లల భద్రతపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నియంత్రణలకు సిద్ధమైంది. ప్రతిపాదిత డిజిటల్‌ డ్యూటీ ఆఫ్‌ కేర్‌ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు వాటి ప్రపంచ వార్షిక ఆదాయంలో గరిష్ఠంగా 5 శాతం వరకు జరిమానా విధించేలా కీలక ఒప్పందం కుదిరింది. గూగుల్‌, మెటా వంటి టెక్‌ దిగ్గజాలకు ఇది గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.

నవంబర్‌ 24, 2026న అధికార లేబర్‌ పార్టీ, గ్రీన్స్‌ పార్టీ మధ్య కుదిరిన ఒప్పందం ఈ మార్పుకు కీలక మలుపు. తొలుత 10.92 కోట్ల ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా ఉన్న గరిష్ఠ జరిమానా పరిమితిని తాజా ఒప్పందం ప్రకారం ప్రపంచ ఆదాయంలో 5 శాతానికి పెంచారు. వినియోగదారులకు తీవ్ర హాని కలిగే పరిస్థితులను నివారించడంలో సంస్థలు విఫలమైతే ఈ జరిమానా వర్తిస్తుంది.

టెక్‌ సంస్థల ప్రధాన బాధ్యతలు

  • పిల్లలపై లైంగిక దోపిడీ, హింస ప్రేరేపణ, తీవ్రవాద ప్రచారం, నకిలీ నగ్న చిత్రాలను అడ్డుకోవాలి.

  • అశ్లీల కంటెంట్‌, ప్రమాదకర ఆహార అలవాట్ల ప్రచారం, మానసిక క్షోభ కలిగించే అంశాల నుంచి మైనర్లను రక్షించాలి.

  • 16 ఏళ్లు పైబడిన వారికి అల్గారిథమ్‌ సిఫార్సులు కావాలా లేక తాము అనుసరించే ఖాతాల పోస్టులే కనిపించాలా అనే ఎంపిక కల్పించాలి.

  • సైబర్‌ వేధింపులు, దుర్వినియోగ ఫిర్యాదులపై స్పందించే గడువును 48 గంటల నుంచి 24 గంటలకు తగ్గించాలి.

  • నకిలీ నగ్న చిత్రాల యాప్‌లు, వెబ్‌సైట్లపై కఠిన చర్యలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి.

బాధ్యతల నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితే బాధితులు వ్యక్తిగతంగా లేదా సమూహంగా దావా వేసేలా ప్రైవేట్‌ రైట్‌ ఆఫ్‌ యాక్షన్‌ కల్పించనున్నారు. స్వతంత్ర బాహ్య వివాద పరిష్కార వ్యవస్థనూ ప్రతిపాదించారు.

కమ్యూనికేషన్స్‌ మంత్రి అనికా వెల్స్‌ నవంబర్‌ 24న పార్లమెంట్‌ హౌస్‌ వద్ద ఈ ఒప్పందాన్ని వెల్లడించారు. సెనేట్‌లో సవరణల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఇది ఇంకా పూర్తిస్థాయి చట్టంగా అమల్లోకి రాలేదు. ఆమోదం తర్వాత అమలుకు 12 నెలల పరివర్తన గడువు ఉంటుంది. హానికర కంటెంట్‌ నిర్వచనం విస్తృతంగా ఉండటంతో భావప్రకటన స్వేచ్ఛపై ప్రభావం పడవచ్చని ప్రతిపక్ష కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి: సారొచ్చారు.. బంగారాన్ని పెంచారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement