ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్‌ బంపర్‌ ఆఫర్‌ | Google Invests 5 Million USD in IIT Kharagpur Big Boost for AI Research | Sakshi
Sakshi News home page

ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్‌ బంపర్‌ ఆఫర్‌

Nov 21 2026 2:40 PM | Updated on Nov 21 2026 3:02 PM

Google Invests 5 Million USD in IIT Kharagpur Big Boost for AI Research

రూ.46 కోట్ల ఏఐ నిధుల బూస్ట్‌

భారత్‌లో ఏఐ పరిశోధన, ఆవిష్కరణలను కొత్త పుంతలు తొక్కించేందుకు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ నిర్ణయం తీసుకుంది. ప్రఖ్యాత ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్‌కు 5 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.46 కోట్ల) ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. దేశీయ సామాజిక సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొనడంతో పాటు భవిష్యత్‌ సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దడం ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశం.

కీలక విభాగాల్లో నిధుల వినియోగం

  • ఆంగ్ల భాషా ఆధిపత్యాన్ని అధిగమించి భారతీయ భాషల్లో ఏఐ సాంకేతికతను విస్తరించడంపై పరిశోధకులు దృష్టి సారిస్తారు. దీనితో పాటు వ్యవసాయం, మెటీరియల్స్‌ సైన్స్‌, విద్యా సాంకేతికత (ఎడ్‌టెక్‌) రంగాల్లో క్షేత్రస్థాయి సవాళ్లను పరిష్కరించే ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తారు.

  • ఏఐ నైపుణ్యాలను కేవలం కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకే పరిమితం చేయకుండా అన్ని విభాగాల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులకు చేరువ చేయనున్నారు. ఇందుకోసం ఆధునిక పాఠ్యప్రణాళికల రూపకల్పనకు గూగుల్‌ తోడ్పాటు అందిస్తుంది.

  • క్యాంపస్‌లో నూతన ఏఐ ఫ్రేమ్‌వర్క్‌లు, పరిశోధనా సాధనాలను అభివృద్ధి చేసి వినూత్న నమూనాల రూపకల్పనకు అవసరమైన సాంకేతిక వాతావరణాన్ని బలోపేతం చేస్తారు.

సుందర్‌ పిచాయ్‌ ఏమన్నారంటే..

తన విద్యా ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఐఐటీ ఖరగ్‌పూర్‌ తదుపరి తరం విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడటం ఎంతో సంతోషంగా ఉందని గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. భారతీయ భాషలు, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో ఈ సంస్థ చేస్తున్న పరిశోధనల ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరాలన్న లక్ష్యానికి ఈ నిధులు ఊతమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధన, శిక్షణ, మౌలిక వసతులను ఒకే వేదికపైకి తీసుకురావడం విద్యాసంస్థలు–పరిశ్రమల భాగస్వామ్యంలో కీలక మైలురాయి కానుంది. అయితే, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, అమలు కాలపరిమితిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌లో యాప్‌.. వెబ్‌సైట్‌.. ఏది బెటర్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement