167 ఏళ్ల గణిత సమస్యకు ఏఐ పరిష్కారం | 167-Year-Old Riemann Hypothesis Solved by Claude AI Anthropic | Sakshi
Sakshi News home page

167 ఏళ్ల గణిత సమస్యకు ఏఐ పరిష్కారం?

Nov 21 2026 11:39 AM | Updated on Nov 21 2026 11:39 AM

167-Year-Old Riemann Hypothesis Solved by Claude AI Anthropic

గణిత శాస్త్రంలో 167 ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన అత్యంత సంక్లిష్టమైన ‘రీమాన్‌ హైపోథిసిస్‌’ సమస్యను ఏఐ సాయంతో ఛేదించానంటూ ఆంత్రోపిక్‌ సంస్థకు చెందిన గణిత శాస్త్రవేత్త లెవెంట్‌ ఆల్పోజ్‌ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా సంచలనం రేపింది. ఆంత్రోపిక్‌ అభివృద్ధి చేసిన క్లాడ్‌ ఏఐతో కలిసి ఈ చారిత్రక సమస్యకు నిరూపణ(ప్రూఫ్‌) కనుగొన్నట్లు ఆయన వెల్లడించడం సాంకేతిక, శాస్త్ర రంగాల్లో కొత్త చర్చకు దారితీసింది. అయితే, ఈ ప్రకటన వెలువడినంత మాత్రాన సమస్య పరిష్కారమైనట్లు భావించలేమని, అంతర్జాతీయ గణిత నిపుణుల స్వతంత్ర పరిశీలన పూర్తయ్యే వరకు వేచి చూడాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

అసలు ఏమిటీ రీమాన్‌ హైపోథిసిస్‌?

జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త బెర్న్‌హార్డ్‌ రీమాన్‌ 1859లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గణిత శాస్త్రానికి మూలస్తంభాలైన ప్రధాన సంఖ్యలు సహజ సంఖ్యల మధ్య ఏ క్రమంలో విస్తరించి ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఈ సిద్ధాంతం అత్యంత కీలకం. రీమాన్‌ జీటా ఫంక్షన్‌లోని ‘సాధారణేతర శూన్యాలు’ (Non-trivial Zeros) అన్నీ ఒక నిర్దిష్ట నిలువు రేఖపైనే (వాస్తవ భాగం 1/2 ఉండే రేఖపై) ఉంటాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఇప్పటివరకు సూపర్ కంప్యూటర్ల సాయంతో మొదటి 10 ట్రిలియన్‌ శూన్యాలను పరీక్షించగా అవన్నీ ఈ నియమానికి లోబడే ఉన్నాయని తేలింది. కానీ, అనంతమైన సంఖ్యలన్నింటికీ ఇది వర్తిస్తుందని నిరూపించే సంపూర్ణ గణిత సూత్రం ఇప్పటివరకు ఎవరికీ చిక్కలేదు.

క్లాడ్‌ ఏఐ, లీన్‌ కోడ్‌ చుట్టూ నెలకొన్న ఆసక్తి

లెవెంట్‌ ఆల్పోజ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం, క్లాడ్‌ ఏఐ సహాయంతో రూపొందించిన ఈ నిరూపణను లీన్‌ (Lean) అనే ఫార్మల్‌ మ్యాథమెటిక్స్‌ ప్రోగ్రామింగ్‌ వ్యవస్థలో క్రోడీకరించారు. ఏఐతో జరిగిన సుదీర్ఘ పరిశోధనలో దాదాపు 2.5 లక్షలకు పైగా పేజీల సమాచారం ఉత్పత్తి కాగా తుది నిరూపణకు సంబంధించిన లీన్‌ కోడ్‌ సుమారు 1.7 కోట్ల లైన్ల మేర ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ కథనం పేర్కొంది.

సాధారణంగా లీన్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థలు గణితంలోని తార్కిక దశలను కంప్యూటర్‌ పరంగా ధ్రువీకరిస్తాయి. అయితే, కోడ్‌ కంపైల్‌ అయినంత మాత్రాన అసలు సమస్య పరిష్కారమైనట్లు కాదు. ఆ కోడ్‌లో ఉపయోగించిన నిర్వచనాలు, ప్రారంభ అంచనాలు రీమాన్‌ హైపోథిసిస్‌కు సరిగ్గా సరిపోతాయా లేదా అనేది గణిత మేధావులు క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. స్వయంగా ఆల్పోజ్‌ కూడా తాను ఈ 1.7 కోట్ల లైన్ల నిరూపణలోని గణనలను పూర్తిగా విశ్లేషించి, సాధారణ పరిశోధనా పత్రంగా మార్చాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం. మరోవైపు, ఈ ప్రకటనపై ఆంత్రోపిక్‌ సంస్థ నుంచి ఇంకా అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.

అమెరికాకు చెందిన ‘క్లే మ్యాథమెటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’ 2000 సంవత్సరంలో ప్రకటించిన ఏడు ‘మిలీనియం ప్రైజ్‌’ సమస్యల్లో రీమాన్‌ హైపోథిసిస్‌ ఒకటి. దీన్ని పరిష్కరించిన వారికి 1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల బహుమతి లభిస్తుంది. నిబంధనల ప్రకారం, నిరూపణను ప్రముఖ గణిత జర్నల్‌లో ప్రచురించిన తర్వాత, అంతర్జాతీయ గణిత నిపుణులు కనీసం రెండేళ్ల పాటు దాన్ని పరిశీలించి ఆమోదించాలి. ప్రస్తుతం క్లే ఇన్‌స్టిట్యూట్‌ అధికారిక జాబితాలో రీమాన్‌ హైపోథిసిస్‌ ఇంకా పరిష్కారం కాని సమస్యగానే ఉంది.

ఇదీ చదవండి: పాదరసం నుంచి బంగారం తయారీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement