బలవంతపు నవ్వైనా.. బోలెడంత రిలీఫ్‌... ఓసారి నవ్వి చూడండి! | Fake Smile Mental Health Benefits | Sakshi
Sakshi News home page

బలవంతపు నవ్వైనా.. బోలెడంత రిలీఫ్‌... ఓసారి నవ్వి చూడండి!

Nov 4 2026 8:08 AM | Updated on Nov 4 2026 8:08 AM

Fake Smile Mental Health Benefits

బలవంతపు నవ్వుతోనూ మూడ్‌ చేంజ్‌

ముఖ కండరాల కదలికలతో హ్యాపీ హార్మోన్ల విడుదల

నిరుత్సాహంగా, చికాకుగా ఉన్నప్పుడు ముఖంపై నవ్వు తెచ్చుకోవడం లేదా అద్దంలో చూసి నవ్వడం వల్ల మూడ్‌ మారే అవకాశం కచ్చితంగా ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ‘ఫేక్‌ ఇట్‌.. అన్‌టిల్‌ యూ మేకిట్‌’అనే సూత్రం నవ్వు విషయంలో కొంతవరకు నిజమేనట.

బలవంతపు నవ్వు మనిషి మానసిక, శారీరక స్థితిగతులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై దశాబ్దాలుగా మనస్తత్వ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. కృత్రిమంగా నవ్వినా సరే అది మెదడును కొంతవరకు మభ్యపెట్టి సానుకూల ప్రభావాలను అందిస్తుందని తేలింది. దీన్నే ‘ఫేషియల్‌ ఫీడ్‌బ్యాక్‌ హైపోథెసిస్‌’అని పిలుస్తున్నారు.

అధ్యయనాల్లో తేలింది ఇదే..

  • మనం బలవంతంగానైనా సరే నవ్వినప్పుడు ముఖంలోని కండరాల కదలికల వల్ల మనం సంతోషంగా ఉన్నామనే సంకేతాలు మెదడుకు అందుతాయి. దీనివల్ల డోపమైన్, సెరోటోనిన్‌ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని కలిగిస్తాయి.

ఒత్తిడితో కూడిన పనులు చేసిన తర్వాత ముఖాన్ని సాధారణంగా ఉంచిన వారితో పోలిస్తే, బలవంతంగానైనా నవ్విన వారిలో గుండె వేగం త్వరగా సాధారణ స్థితికి వచ్చింది. శరీరంలో కారి్టసాల్‌ (స్ట్రెస్‌ హార్మోన్‌) స్థాయిలు తగ్గాయి.

  • కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక ప్రయోగం ప్రకారం.. తీవ్రమైన చల్లటి నీటిలో చేతులు ఉంచినప్పుడు(బాధాకరమైన స్థితి) కూడా నవ్విన వారు తక్కువ నొప్పిని అనుభవించారు. వారు సాధారణ స్థితికి వేగంగా చేరుకున్నారు.

ఉపశమనమే.. శాశ్వత పరిష్కారం కాదు..

  • బలవంతపు నవ్వుతో ఉపశమనం ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. తీవ్రమైన డిప్రెషన్‌ లేదా మానసిక బాధలకు శాశ్వత పరిష్కారం కాదు.

  • ఆఫీసుల్లో లేదా పని ప్రదేశాల్లో తోటి ఉద్యోగులు లేదా కస్టమర్ల కోసం రోజంతా ఇష్టం లేకపోయినా బలవంతంగా నవ్వాల్సి రావడం వల్ల మానసిక అలసట, ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

  • కస్టమర్‌ సర్వీస్, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ రంగాల్లో పనిచేసే వారు ఉద్యోగ ధర్మం కోసం నిరంతరం నవ్వుతూ ఉండాల్సి వస్తుంది. దీనిని సర్ఫేస్‌ యాక్టింగ్‌ అంటారు. జర్నల్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ సైకాలజీలోని ఒక అధ్యయనం ప్రకారం.. అంతర్గత బాధను దాచిపెట్టి రోజంతా బలవంతంగా నవ్వే ఉద్యోగులు తీవ్రమైన మానసిక అలసటకు లోనవుతారు.

  • తాత్కాలిక ఒత్తిడి ఉపశమనానికి బలవంతపు నవ్వు ఒక మంచి సైకలాజికల్‌ టూల్‌. కానీ, దీర్ఘకాలిక సంతోషం కోసం మాత్రం మనస్ఫూర్తిగా వచ్చే సహజమైన నవ్వు మాత్రమే నిజమైన ఔషధం.

ఇదీ చదవండి: కలలు కూడా గైడ్‌ చేస్తాయా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement