ధర్మశాస్త్ర పండితుడైన సౌలు తన సొంత యూదులను అనగా యూదులలో నుండి క్రైస్తవులైన యూదా క్రైస్తవులను హింసలకు గురి చేశాడు. యేసును మెస్సీయగా గుర్తించని యూదులు స్తెఫనును చంపుతుంటే అదొక వేడుకగా చూస్తూ వారిపక్కనే ఉన్నాడు. దమస్కులోని క్రైస్తవులను హింసించి చంపడానికి తన అనుచరులతో సౌలు బయలుదేరి వెళుతుంటే దమస్కు మార్గమున సూర్యకాంతిని మించిన కాంతి ఆకాశం నుండి ఆకస్మాత్తుగా అతని కళ్లను తాకడంతో చూపు కోల్పోతాడు.
‘సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు?’ అని ఆకాశం నుండి ఒక స్వరము వినబడుతుంది. నీవు ఎవరవు ప్రభువా? అన్న సౌలు ప్రశ్నకు ‘నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును’ అన్న జవాబు వినిపిస్తుంది. యేసుక్రీస్తు శరీరము అనగా సంఘము లేదా ఆయన పాలనలోని ప్రజలు అని అర్థం. సంఘము అనే తన ప్రజలను హింసిస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. తప్పక వెను వెంటనే ప్రతిస్పందిస్తాడు అన్నది ఇక్కడ నిరూపితమైంది.
కొదువలేని కటాక్షంతో క్రీస్తు తనను మెస్సీయగా ఇక తప్పక గుర్తించిన పౌలు అనబడే సౌలుకు దృష్టి కలుగజేసి అతని పాపాలను క్షమించి తన పరిచర్యకు సువార్త ప్రకటనకు ఎంచుకొని అతన్ని విరివిగా వాడుకోవడం మొదలు పెడతాడు. దేవునిచే పంపబడి శరీరధారిగా వచ్చిన క్రీస్తుకు సహజంగా ఒక్కటే శరీరం ఉంది. అదేవిధంగా ఆయనకు ఒక్కటే శిరస్సు ఉంది. దీన్నే ఆత్మ సంబంధంగా క్రీస్తుకు శరీరం ఒక్కటే అన్న రీతిలో చూస్తే సంఘము ఒక్కటే. అదే క్రీస్తు సంఘము. ఆయనకు శిరస్సు ఒక్కటే అన్న రీతిలో ఉన్నతంగా చూస్తే, మనస్సు పెట్టి ఆలోచన చేస్తే, మరో శిరస్సు అనగా క్రీస్తు ఏలుబడి తప్ప సంఘానికి మరో ఏలుబడి లేదు, ఉండదు, ఉండకూడదు అన్నది తేటగా అర్థమవుతుంది.
– జేతమ్
ఇదీ చదవండి: నవ్వు వెనుక ఏడుపు.. ద్రౌపది ఆవేదన చెప్పే నీతి ఏంటంటే?


